- సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు!
- లాభదాయకంగా నిర్వహించాలని కేంద్రం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్.. సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ పేర్లతో సింగరేణి సంస్థ కొత్తగా రెండు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో పేర్లను రిజర్వు కూడా చేసి పెట్టింది. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా గ్రీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నది.
దేశ, విదేశాల్లో చేపట్టనున్న సోలార్ విద్యుత్తు తదితర పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ కోసం సింగరేణి గ్రీన్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో ముందుకు పోనున్నది. విదేశాలలో ఖనిజాల తవ్వకం ముఖ్యంగా కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తదితర వ్యాపారాల నిర్వహణ కోసం సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ పేరుతో మరొక అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తుంది.
గత నెలలో ఈ రెండు అనుబంధ కంపెనీల పేర్ల కోసం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కు అనుబంధంగా ఉన్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో దరఖాస్తు చేయగా ఇటీవల ఈ రెండు పేర్ల రిజర్వేషన్‌కు అనుమతి లభించింది. సింగరేణిలో ఈ రెండు సంస్థల ఏర్పాటుపై కేంద్ర బొగ్గు శాఖ కూడా సానుకూలంగా స్పందించింది.
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ రాజ్ నయన్ సింగరేణి సంస్థకు లేఖ రాశారు. సింగరేణిలో రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని గుర్తిస్తున్నామని, ఆ సంస్థలు లాభదాయకంగా వ్యాపారాలు కొనసాగించాలని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు
