ఒడిశాలో సింగరేణి పవర్ ప్రాజెక్టులకు 18న ఒప్పందం

ఒడిశాలో సింగరేణి పవర్ ప్రాజెక్టులకు 18న ఒప్పందం
  •     2,400 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు, 2,500 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: ఒడిశాలో 4,900  మెగావాట్ల థర్మల్, గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సింగరేణి సంస్థ ఆ రాష్ట్ర సర్కారుతో ఈ నెల 18న రెండు ఒప్పందాలను కుదుర్చుకోనుంది. 

ఈ మేరకు మంగళవారం సింగరేణి సంస్థ సీఎండీ బలరాం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒడిశాలో ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాకుకు అనుబంధంగా 2,400 మెగావాట్ల (3x800) సామర్థ్యం గల అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని సింగరేణి నిర్ణయించిందని.. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ‘ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా లిమిటెడ్’ (ఐపీఐసీఓఎల్) తో ఒప్పందం కుదుర్చుకోనున్నదని పేర్కొన్నారు. నైనీ బ్లాక్ నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గును క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్ కు వినియోగించాలన్న నిబంధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల ఒడిశాతో పాటు సింగరేణి సంస్థకి కూడా ఎంతో మేలు జరుగనుందని వివరించారు. 

సింగరేణి సంస్థ  గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనలో భాగంగా ఒడిశాలో 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు, 500 మెగా వాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, 500 మెగా వాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లు, మరో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని దీనిపై కూడా ఐపీఐసీఓఎల్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు సీఎండీ తెలిపారు. ఒడిశా రాష్ట్ర ప్రయోజనాలు, విద్యుత్ అవసరాల రీత్యా సింగరేణి సంస్థతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఐపీఐసీఓఎల్​ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన ఇరుపక్షాల ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నట్లు బలరామ్ వివరించారు.