సింగరేణిలో రికార్డు స్థాయి టర్నోవర్

సింగరేణిలో రికార్డు స్థాయి టర్నోవర్
  • 8 నెలలు.. 924.4 కోట్లు
  • సింగరేణికి లాభాల పంట
  • 16,512 కోట్ల రికార్డు స్థాయి టర్నోవర్​
  • ప్రకటించిన సింగరేణి యాజమాన్యం

మందమర్రి, వెలుగు: సింగరేణి సంస్థ ఈ ఏడాది లాభాల బాటలో దూసుకెళ్తోంది. కరోనా విపత్తుతో చాలా పరిశ్రమలు ఆర్థికంగా నష్టపోయాయి. దానికి భిన్నంగా సింగరేణి లాభాల్లో పయనిస్తూ స్ఫూర్తిగా నిలుస్తోంది. కొవిడ్​ కేసుల్ని నియంత్రిస్తూనే బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటూ ఆశించిన లాభాలు సాధిస్తోంది. 2021–-22 ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో రూ.924.4 కోట్ల లాభాలను ఆర్జించింది.ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు నెలల కాలం ఉండగానే సింగరేణి సంస్థ రూ.16,512 కోట్ల అమ్మకాలను జరిపింది. ఈ మేరకు బుధవారం సింగరేణి యాజమాన్యం  వివరాలు వెల్లడించింది. మరోవైపు  బొగ్గు అవసరాలు పెరగడంతో సింగరేణిపై ఒత్తిడి పెరిగింది. దీంతో సింగరేణి నుంచి వివిధ పరిశ్రమలకు బొగ్గును సరఫరా చేసేందుకు ఉత్పత్తి పెంచుకుంది. బొగ్గు, పవర్​ అమ్మకాల ద్వారా లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

రికార్డు స్థాయిలో టర్నోవర్​
గత ఏడాది ఇదే సమాయానికి రూ.1,038.86 కోట్ల నష్టాలను సింగరేణి చవిచూసింది. ఈ ఏడాది 189శాతం వృద్ధితో రూ.924.4 కోట్లు లాభాలు గడించింది.2021–-22లో నవంబర్​నెల చివరి నాటికి బొగ్గు, విద్యుత్తు ఉత్పత్తితో 16,512 కోట్ల టర్నోవర్​ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది ఇదే సమయానికి టర్నోవర్​రూ.10,127 కోట్లు ఉండగా ఈ ఏడాది దానిపై 63 శాతం వృద్ధి సాధించింది. సంస్థ సాధించిన టర్నోవర్​లో బొగ్గు అమ్మకాలతో రూ.13,973 కోట్లు, విద్యుత్​ అమ్మకాలతో రూ.2,539 కోట్లు సాధించింది. లాభాల్లో కూడా కోలిండియా సంస్థకు అందనంత దూరంలో సింగరేణి ముందుకు సాగుతోంది.  కోలిండియాలో 16 శాతం లాభాల వృద్ధి ఉండగా సింగరేణి ఏకంగా 201 శాతంతో కొత్త రికార్డును సృష్టించింది. రానున్న మూడున్నర  నెలల్లో మరింత వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి టార్గెట్​70 మిలియన్​ టన్నులను  సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓసీపీ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం లేకుండా ఓబీ తొలగింపు, ఇతర ఆటంకాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రోజుకు రెండు లక్షల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కంపెనీ అదే స్థాయిలో రవాణా కూడా చేస్తోంది.  

ఉద్యోగుల కృషితోనే..
సింగరేణి ప్రగతికి ఉద్యోగులు చూపిస్తున్న కృషి, పట్టుదల ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. 8 నెలల కాలంలో మెరుగైన ఉత్పత్తి, బొగ్గు రవాణా జరిపి గత ఏడాదికన్నా అమ్మకాలు, లాభాల్లో వృద్ధిని సాధించింది. ఎంప్లాయీస్​, ఆఫీసర్లు, కార్మిక సంఘాల సహకారం ఇందుకు కారణం. ఇదే ఒరవడిని ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన మూడున్నర నెలల కాలం కూడా కొనసాగిస్తూ నిర్దేశిత ఉత్పత్తి సాధించాలె.
- ఎన్​.శ్రీధర్, సింగరేణి సీఎండీ