సింగరేణిలో మరో కొత్త గని .. మందమర్రి ఏరియాలో ఆర్కేపీ ఓసీపీ ఫేజ్–-2 కోల్మైన్

సింగరేణిలో మరో కొత్త గని .. మందమర్రి ఏరియాలో ఆర్కేపీ ఓసీపీ ఫేజ్–-2 కోల్మైన్
  •     తుదిదశకు చేరిన అటవీ అనుమతుల ప్రక్రియ
  •     రాష్ట్ర మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ చొరవతో కదలిక
  •     మైనింగ్​ కార్యకలాపాలకు సింగరేణి ముందస్తు ఏర్పాట్లు
  •     18 ఏండ్ల పాటు బొగ్గు ఉత్పత్తికి చాన్స్
  •  

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో మరో కొత్త గని ప్రారంభానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్​ ఓపెన్​కాస్ట్​ విస్తరణలో భాగంగా ఫేజ్–-2 కోల్​మైన్  ఏర్పాటుపై సింగరేణి యాజమాన్యం ఫోకస్​ పెట్టింది. అటవీ అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే బొగ్గు ఉత్పత్తితో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు, రామకృష్ణాపూర్​తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి జరగనుంది. ఇటీవల  కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్​ యాదవ్ ను మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి అటవీ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి, ఎంపీ చొరవతో పర్మిషన్ల ప్రక్రియలో కదలిక వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి​క్లియరెన్స్  రాగా, తుది అనుమతుల కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు నివేదిక పంపించారు. త్వరలోనే అనుమతులు వస్తాయని అంటున్నారు. ఈ గని ఏర్పాటుతో ఏటా 20 లక్షల టన్నుల చొప్పున 18 ఏండ్ల పాటు 39 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

మందమర్రి ఏరియాలో మొదటి ఓసీపీ

మందమర్రి ఏరియాలో బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు రామకృష్ణాపూర్​లోని ఎంకే-4, 4ఏ గనులను యాజమాన్యం మూసివేసింది. ఈ రెండు గనులతో పాటు అంతకుముందే మూతపడ్డ ఆర్కే-4 గనిలో మిగిలిన బొగ్గు నిక్షేపాలను  వెలికి తీసేందుకు 2013 డిసెంబర్​లో రామకృష్ణాపూర్​ ఓసీపీని ఏర్పాటు చేసింది. ఏటా 3 లక్షల టన్నుల నుంచి 22 లక్షల టన్నుల ఉత్పిత్తి సాధించే స్థాయికి చేరింది. 1.60 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఆ తరువాత బొగ్గు వెలికి తీసేందుకు అవసరమైన భూములు లేకపోవడంతో ఏప్రిల్​ 2024లో  ఆర్కేపీ ఓసీపీని మూసివేశారు.

ఏర్పాట్లలో సింగరేణి ఆఫీసర్లు

ఆర్కేపీ ఓసీపీ ఫేజ్ 2 మైన్ ను​ప్రారంభించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వివిధ హోదాల్లో కీలక ఆఫీసర్లను నియమించారు. గనిలో నాలుగేళ్లలో 1,040 లక్షల క్యూబిక్​ మీటర్ల ఓబీని వెలికితీసేందుకు అవసరమైన టెండర్  ప్రక్రియను రెడీ చేశారు. వారం కింద రూ.50 లక్షలతో కొత్తగా షావల్​ మెషీన్​ కొనుగోలు చేసి ప్రారంభించారు.

రెండో ఫేజ్​ విస్తరణపై నజర్

ఆర్కేపీ ఓసీపీ విస్తరణలో భాగంగా ఫేజ్​-2 కోల్​మైన్​ ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఇందులోభాగంగా గతంలో మూసివేసిన ఆర్కే1,1ఏ, 2, 3 గనులు ఉన్న ప్రాంతాల్లో(ఆర్కేపీ సీహెచ్​పీ ముందు భాగం నుంచి మూసివేసిన ఆర్కే1ఏ మైన్​ అటవీ ప్రాంతం వరకు) మిగిలిన బొగ్గు నిక్షేపాలను రెండో ఫేజ్​ ద్వారా తీసేందుకు ప్లాన్​​చేసింది. 366.41 హెక్టార్ల ఫారెస్ట్​ ల్యాండ్​తో పాటు 600 హెక్టార్ల సాధారణ​భూమి అవసరమని గుర్తించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్కేపీ ఓసీపీ ఫేజ్-​2 కోల్​మైన్  మంజూరులో రాష్ట్ర మంత్రి వివేక్​వెంకటస్వామి కీలకంగా వ్యవహరించారు.

రాష్ట్ర సర్కార్​ను ఒప్పించి గని​మంజూరు కాగానే, సింగరేణి యాజమాన్యం అటవీ, పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేసింది. అటవీభూముల పర్మిషన్లకు కేంద్ర, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖలకు నివేదికలు పంపించింది. అయితే వివిధ కారణాలతో అనుమతులు ఆలస్యం కావడంతో మంత్రి వివేక్​ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర స్థాయి అటవీ అధికారులు, మంచిర్యాల డీఎఫ్​వో రాహూల్​ కిషన్  జాదవ్, కలెక్టర్​ కుమార్​ దీపక్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణతో  కలిసి చర్చలు జరిపారు. అనంతరం తుది అనుమతుల కోసం కేంద్ర మంత్రి భూపేందర్​యాదవ్​ను కలిసారు.