అక్టోబర్‌‌‌‌‌‌‌‌లోనూ మే ఎండలు.. మండు వేసవిలా మారిన వాతావరణం

అక్టోబర్‌‌‌‌‌‌‌‌లోనూ మే ఎండలు.. మండు వేసవిలా మారిన వాతావరణం
  • రోజురోజుకూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
  • రాష్ట్రంలో 35 డిగ్రీలకుపైగా టెంపరేచర్ల నమోదు 
  • ఉక్కపోతతో పెరిగిన ఏసీలు, ఫ్యాన్ల వినియోగం
  • గత నెల 30న 19,892 మెగావాట్ల కరెంట్ వాడకం


 
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. అక్టోబర్​ నెలలోనూ ‘మే’ తరహాలో పగలంతా మంట, రాత్రి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. పగటి ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో టెంపరేచర్లు 35 నుంచి 37 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో వాతావరణంలో తేమ శాతం తగ్గిపోతున్నది. ఉక్కపోత తట్టుకోలేక ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీలు, ఫ్యాన్లు వాడుతుండటంతో  విద్యుత్​ వినియోగం పెరిగింది. ఎండల దెబ్బకు వరి చేన్లు నెర్రెలు బారుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు, ఆఫీసులు, వ్యవసాయ విద్యుత్ అవసరాలు ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్​ డిమాండ్​ రికార్డులను తిరగరాస్తున్నది.
 

సెప్టెంబర్ 30న రాష్ట్రంలో 19,892 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్‌‌ నమోదు అయ్యి చరిత్ర సృష్టించింది. ఎండలు ఇదే తరహాలో ఉంటే రెండేళ్ల తర్వాత వస్తుందనుకునే 20 వేల మెగావాట్ల గరిష్ట విద్యుత్​ డిమాండ్​ అక్టోబర్​ నెలలోనే  నమోదు కావచ్చని విద్యుత్​ శాఖ ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు.
పెరిగిన ఎండల తీవ్రత


రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వెనక్కితగ్గడంతో ఎండల తీవ్రత పెరిగింది. దీంతో గడిచిన 3 రోజులుగా రైతులు, దినసరి కూలీలు, ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడ్తున్నారు. సాధారణంగా అక్టోబర్‌‌లో ఎండలు తగ్గుముఖం పట్టి, క్రమంగా మంచుకురవడం మొదలవ్వాలి.  కానీ ఈసారి ఎల్​నినో ఎఫెక్ట్​తో వాతావరణం ఎండలను తలపిస్తున్నది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 3 రోజులుగా రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్లు ఎక్కువగా ఉంటున్నాయి.

ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీలుగా,  కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగీలుగా నమోదవుతున్నాయి. సెప్టెంబర్​ 30న ఖమ్మంలో 37.1, నల్గొండ జిల్లా చందంపేట్​లో 37.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకాగా, మిగిలిన అన్ని చోట్లా 35 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. గ్రేటర్​ లో ‘అర్బన్ హీట్ ఐలాండ్’ ఎఫెక్ట్ కారణంగా రాత్రి వేడిగా ఉంటున్నది. ఈ ఏడాది చలికాలం నవంబర్‌‌ లో మొదలవుతుందని వెదర్​ ఎక్స్​పర్ట్స్​ అంచనా వేస్తున్నారు. ఈలోగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే చాన్స్​ ఉందని హెచ్చరిస్తున్నారు.