టెల్ అవీవ్: ఫ్లైదుబాయ్ విమాన దాడి ఘటనకు సంబంధించి మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉన్న సమయంలో కో పైలట్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ మాట్లాడిన వీడియో తాజాగా బయటకొచ్చింది. ఈ వీడియోలో ఆయన ఒంటిపై రక్తపు గాయాలతో, తీవ్ర వేదనలో సహాయం అందుకుంటూ కనిపించారు. మచ్చర్ మాట్లాడుతూ.. "అతడు నాపై చాలా సార్లా దాడి చేశాడు" అంటూ చెప్పారు. తన చేతిని కదిలించలేకపోతున్నానని, పట్టు కోల్పోతున్నానని ఆయన చెబుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి.
అనుకోకుండా పైలట్ అయి..
ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలెట్ దాడిలో తీవ్రంగా గాయపడినా, ధైర్యంతో ప్రయాణికులను కాపాడిన స్మిత్ మచ్చర్ అనుకోకుండానే పైలెట్ అయ్యారట. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి. తాను పైలట్ కావాలనుకోలేదని కుటుంబానికి చెందిన టెక్స్‌టైల్ వ్యాపారాన్నే చూసుకోవాలని భావించానని అందులో ఆయన తెలిపారు. అందుకే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు.
ఆ తర్వాత ముంబైలోని వెలింకర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ (మేనేజ్‌మెంట్ స్టడీస్) పూర్తి చేశారు. అయితే, అప్పుడు జరిగిన ఒక ఏవియేషన్ సెమినార్ ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సెమినార్ ఆయనకు ఏవియేషన్ ఇండస్ట్రీపై ఆసక్తిని పెంచింది. దీంతో కుటుంబ వ్యాపారాన్ని పక్కన పెట్టి ఏవియేషన్‌ను ఎంచుకున్ననారు.
న్యూజిలాండ్‌లో పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత కమర్షియల్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టారు. బోయింగ్ 737 విమానాలను నడపడంలో అనుభవం సంపాదించారు. ఆయన తన మొదటి కమర్షియల్ విమానాన్ని బెంగళూరు నుంచి ఢిల్లీకి నడిపారు. జూన్ 2011లో స్పైస్‌జెట్‌లో చేరారు. దాదాపు11 ఏండ్లకుపైగా అదే సంస్థలో కొనసాగారు. సీనియర్ కమాండర్‌గా, లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా ఎదిగి తోటి పైలట్లకు శిక్షణ ఇచ్చారు.
ఆయన తన కెరీర్‌లో బోయింగ్‌కు చెందిన అనేక రకాల విమానాలను నడిపారు. సుమారు 9,750 గంటల పాటు విమానం నడిపిన అనుభవాన్ని సంపాదించారు. ఆ తర్వాత జూన్ 2022లో ఫ్లైదుబాయ్ సంస్థలో డైరెక్ట్- ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు.
