- కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసంతో
- ఫ్లైదుబాయ్ఫ్లైట్కు తప్పిన పెను ముప్పు
- ఐదు అనూహ్య ఘటనలతో
- ప్రాణాలతో బయటపడ్డ ప్యాసింజర్స్
టెల్అవీవ్: ఫ్లైదుబాయ్ కి చెందిన విమాన ఘటన యావత్ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసిన విషయం తెలిసిందే. దుబాయ్నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ కు బయలుదేరిన ఫ్లైట్‌లో కో-పైలట్ విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించగా.. ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ చూపిన సాహసం వల్ల పెను ప్రమాదం తప్పింది. విమానంలోని ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ అనూహ్య ఘటనలో ఐదు మిరాకిల్స్ చోటుచేసుకున్నాయి.
కాక్‌పిట్ డోర్ తెరుచుకోవడం..
కో-పైలట్ ఫ్లైట్కంట్రోల్ను తన చేతుల్లోకి తీసుకుని, ఇజ్రాయెల్‌లో దాన్ని కూల్చేయాలని కుట్ర పన్నాడు. ఈ క్రమంలో ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అనంతరం పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కో-పైలట్ కత్తితో దాడి చేశాడు. దీంతో కెప్టెన్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, తీవ్రంగా గాయపడి, తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ అత్యంత సాహసంతో తన చివరి ప్రయత్నంగా కాక్‌పిట్ డోర్‌ను అన్‌లాక్ చేయగలిగారు. ఆ తలుపు తెరుచుకోకపోతే ప్రయాణికులు లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అడ్డుకోవడం సాధ్యమయ్యేది కాదు.
సకాలంలో ప్రయాణికుల జోక్యం..
కాక్‌పిట్ డోర్ తెరుచుకోవడంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, ఆఫ్‌డ్యూటీ సిబ్బంది లోపలికి దూసుకెళ్లారు. కాక్‌పిట్ లో రక్తం మడుగులో పడి ఉన్న కెప్టెన్‌ను, కంట్రోల్ ప్యానెల్‌ను పాడుచేస్తున్న కో-పైలట్‌ను గమనించారు. వెంటనే ప్రయాణికులలో కొందరు బలమైన వ్యక్తులు (ఇజ్రాయెల్ వాసులు) దాదాపు 50 నిమిషాల పాటు నిందితుడైన కో-పైలట్‌ను కదలకుండా కట్టడి చేశారు.
డాక్టర్ మూసావ్ ట్రీట్‌మెంట్..
ఆ విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ (డెంటిస్ట్) షోటా మూసావ్ వెంటనే స్పందించి కెప్టెన్ స్మిత్ ప్రాణాలు కాపాడారు. తీవ్ర గాయాలపాలై, చేతులు, మెడ భాగంలో తీవ్రంగా రక్తం కారిపోయి అపస్మారక స్థితికి చేరువవుతున్న కెప్టెన్‌కు ప్రథమ చికిత్స అందించి, రక్తస్రావాన్ని అరికట్టి ఆయన్ని ప్రాణాలతో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో మరో ప్రయాణికుడు (ఒక ప్లంబర్) విమాన లెవర్లను పైకిలాగి విమానం సమాంతరంగా వెళ్లేలా చేశాడు.
ఫ్లైట్‌ను కంట్రోల్లోకి తీసుకున్న ఆఫ్-డ్యూటీ పైలట్లు
ఈ సంక్షోభ సమయంలో అదృష్టవశాత్తూ అదే విమానంలో ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు ప్రయాణికులుగా ఉన్నారు. వారు వెంటనే కాక్‌పిట్‌లోకి ప్రవేశించి, విమాన నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నారు.
దెబ్బతిన్న విమానం తోక భాగం
ఘటన సమయంలో విమానం తోక భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. అయినప్పటికీ, పైలట్ల సమయస్ఫూర్తి వల్ల విమానం ముక్కలుకాకుండా సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇలా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ అసాధారణ ధైర్యసాహసాలు, ప్రయాణికుల సామూహిక స్పందన వల్ల సుమారు 180 మంది ప్రాణాలు దక్కాయి.
ఈ ముగ్గురిదీ కీలకపాత్రే..
ఈ మొత్తం ఘటనలో భారతీయ పైలట్, ఆఫ్ డ్యూటీ పైలెట్లతో పాటు మరో నలుగురు కీలక పాత్ర పోషించారు. యానివ్ హయున్ అనే ప్లంబర్ విమానం కిందకు పడిపోతున్న సమయంలో ఎలాంటి భయం లేకుండా నేరుగా కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లాడు. సీట్ల మధ్య నిందితుడిని ఈడ్చుకెళ్లి అడ్డుకున్నాడు. ‘మేడే’ అనే టీవీ షో ద్వారా నేర్చుకున్న అనుభవంతో, స్వయంగా ఫ్లైట్ కంట్రోల్స్‌ను వెనక్కి లాగి అదుపులోకి తెచ్చారు.
అసాఫ్ రజువాన్ అనే ప్యాసింజర్ బాత్‌రూమ్ వైపు నుంచి అరుపులు విన్న వెంటనే కాక్‌పిట్ వైపు వెళ్లాడు. మిగతావారితో కలిసి దాదాపు 50 నిమిషాల పాటు నిందితుడిని కట్టడి చేశాడు. ద్వికా మాన్స్ అనే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ తోటి ప్రయాణికులకు అందించే హెడ్‌ఫోన్ కేబుల్స్‌ను ఉపయోగించి దాడికి పాల్పడిన వ్యక్తిని కట్టేయడంలో కీలక పాత్ర పోషించాడు.
