- ఇప్పటివరకు వచ్చిన మాన్యువల్ ఫామ్లు పక్కకు..
- అమలు కాని ఉన్నతాధికారుల ఆదేశాలు
- ఓటు హక్కు కోసం ఎదురుచూపులు
బంజారాహిల్స్ రోడ్ నంబర్14లో ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు కొత్తగా ఓటు నమోదు కోసం మూడు నెలల కింద మాన్యువల్ గా బీఎల్ వోకు అప్లికేషన్లు ఇచ్చారు. అయితే, వారు ఆ దరఖాస్తులను పక్కకు పడేశారు. అప్లై చేసినప్పటి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రెండు రోజుల కింద మళ్లీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది.
లంగర్ హౌస్ లోని బాపూనగర్ లో ఉంటున్న రాజు కొత్తగా ఓటు నమోదు కోసం అక్కడి సూపర్ వైజర్ కు గురువారం కాల్ చేశాడు. అయితే తాను ‘సర్’ డ్యూటీలో బిజీగా ఉన్నానని, మాన్యూవల్ గా ఫామ్స్ తీసుకోవడం లేదని, ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సమాధానం ఇచ్చాడు.
హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పనుల ఒత్తిడి కొత్త ఓటర్ల నమోదుకు ఆటంకంగా మారుతోంది. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకుంటున్న వారికి బూత్ లెవెల్ ఆఫీసర్ల(బీఎల్‌వోలు) నుంచి ఆశించిన సహకారం అందడం లేదు. ప్రస్తుతం తాము సర్ డ్యూటీల్లో బిజీగా ఉన్నామని, కొత్త ఓటర్లు ఆన్‌లైన్‌లోనే (ఫామ్–-6) దరఖాస్తు చేసుకోవాలని బీఎల్‌వోలు, సూపర్ వైజర్లు తేల్చిచెబుతున్నారు. దీంతో ఇప్పటికే మాన్యువల్‌గా ఫారం-–6 సమర్పించిన వారు ఓటు హక్కు వస్తుందా? రాదా? అన్న అనుమానంలో ఉన్నారు.
18 ఏండ్లు నిండిన వారితో పాటు ఇప్పటివరకు ఓటరు లిస్టులో పేరు నమోదు కాని వారు ఓటు హక్కు కోసం ఫామ్-–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సర్ తో సంబంధం లేకుండా ఫామ్ –6ను కూడా బీఎల్వోలు తీసుకోవాలి. అయితే, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉన్నా, బీఎల్‌వోలు మాన్యువల్ దరఖాస్తులను తీసుకోవడం లేదు. సర్ పని చేయడమే తమతో కావడంలేదని, కొత్త ఓటర్ల నమోదు అస్సలే కాదని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
వేలల్లోనే పెండింగ్..
హైదరాబాద్ జిల్లాలో 4,062 మంది బీఎల్ వోలు ఉండగా, వీరి దగ్గర దాదాపు వేలల్లో ఫామ్-–6 లు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. ఇక కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి ఉన్నతాధికారులు ఫామ్–6 తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమలు కావడంలేదు. బీఎల్‌వోలతో పాటు కొందరు సూపర్‌వైజర్లు కూడా తమకు సర్ పనులే ప్రథమ ప్రాధాన్యమని, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి తమకు పైనుంచి క్లారిటీ రాలేదని చెబుతున్నారు.
ఎలక్షన్ కమిషన్ తో పాటు జిల్లా ఎన్నికల అధికారులు మాత్రం మాన్యువల్ విధానంలోనూ ఓటు హక్కు కోసం బీఎల్ వోల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉన్నా.. మాన్యువల్‌గా ఫామ్–6 సమర్పించాలనుకునే వారు బీఎల్వోలను సంప్రదించాలని అంటున్నారు.
చదువుకోని వారికి తిప్పలు
ప్రభుత్వం ఓటరు నమోదు ప్రక్రియను డిజిటలైజ్ చేస్తూ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌తో పాటు ఎన్వీఎస్పీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే, చదువుకోని వారికి స్మార్ట్‌ఫోన్లు వాడడం, యాప్‌లలో వివరాలు నమోదు చేయడం, ఫొటోలు, ఇతర పేపర్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడం రాదు. దీంతో వారు మాన్యువల్ లో ఫారం–-6ను పూర్తి చేసి ఇవ్వడానికి బీఎల్వోలను సంప్రదిస్తే తీసుకోవడం లేదు. దీంతో ఉచితంగా కావాల్సిన ఓటరు నమోదు కోసం వీరు రూ.100 నుంచి రూ.200 వరకు నెట్ సెంటర్లకు పెట్టాల్సి వస్తోంది.
