ఏడు రోజుల్లో సంతకం చేయకుంటే..  ఉప సర్పంచ్ చెక్ పవర్ కట్

ఏడు రోజుల్లో సంతకం చేయకుంటే..  ఉప సర్పంచ్ చెక్ పవర్ కట్
  • సర్పంచ్ సిగ్నేచర్ తర్వాత 7 పనిదినాల డెడ్‌‌‌‌లైన్
  • జాప్యానికి కారణం కలెక్టర్​కు చెప్పాల్సిందే
  • లేదంటే అధికారులకు చెక్ పవర్ బదిలీ
  • పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య ఉత్తర్వులు
  • సర్పంచ్- ఉప సర్పంచ్ చెక్ పంచాయితీకి తెర 

హైదరాబాద్, వెలుగు:  గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య ఏండ్లుగా నడుస్తున్న ‘చెక్​పవర్​ పంచాయితీ’కి ప్రభుత్వం చెక్​పెట్టింది. ఏదైనా బిల్లుపై సర్పంచ్​ సంతకం చేసిన 7 రోజుల్లోగా ఉపసర్పంచ్​ కూడా సంతకం చేయాలి. లేదంటే అందుకు సరైన కారణం చూపాలి. ఒకవేళ ఎలాంటి కారణం లేకుండా చెక్కులపై సంతకాలు చేయడం లేదా వ్యయాన్ని డిజిటల్ సిగ్నేచర్ కీ ద్వారా ఆమోదించడంలో కావాలని జాప్యం చేసినట్లు కలెక్టర్​ విచారణలో తేలితే ఉపసర్పంచ్​ చెక్​పవర్​ రద్దుకానుంది. ఈ మేరకు పంచాయతీరాజ్​రూరల్ ​డెవలప్​మెంట్​ కమిషనర్​ దివ్య దేవరాజన్​ గురువారం మెమో జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా  జిల్లా కలెక్టర్లు  వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

వరుస ఫిర్యాదుల నేపథ్యంలో నిర్ణయం

రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీల్లో కొంతమంది ఉప సర్పంచులు సరైన కారణం లేకుండా చెక్కులపై సంతకాలు చేయకపోవడం వంటి ఫిర్యాదులు రాష్ట్రప్రభుత్వానికి అందాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య ఆధిపత్య, రాజకీయ, ఇతర కారణాల వల్ల బిల్లుల చెల్లింపు ఆలస్యం అవుతోందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

మరీ ముఖ్యంగా సర్పంచ్ సంఘాలు మంత్రి సీతక్క ను పలుసార్లు కలిసి, ఉప సర్పంచుల తీరుతో గ్రామ అభివృద్ధి కుంటుపడుతోందని, జాయింట్ చెక్ పవర్ ను రద్దుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఉప సర్పంచులు సంతకం చేసేందుకు 7 రోజుల: గడువు విధిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసినట్లు స్పష్టమవుతోంది.

వారంలో సంతకం చేయకపోతే కలెక్టర్ విచారణ

బిల్లులకు సంబంధించిన చెక్కులపై సంతకం చేయాలని లేదా డిజిటల్ సిగ్నేచర్ కీ ద్వారా వ్యయా న్ని ఆమోదించాలని ఉప సర్పంచ్ కు సమర్పించిన తేదీ నుంచి 7 పనిదినాల్లోగా సరైన కారణం లేకుండా సంతకం చేయకపోతే.. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాల్సి ఉంటుంది. సంతకం చేయకపోవడానికి లేదా వ్యయాన్ని ఆమోదించకపోవడానికి సరైన కారణం ఉందా లేదా అనే కోణంలో పరిశీలించాలి. ఉప సర్పంచ్ ఎలాంటి కారణం లేకుండా ఉద్దేశపూ ర్వకంగా చెక్కులపై సంతకం చేయకుండా లేదా డిజిటల్ సిగ్నేచర్ ద్వారావ్యయాన్ని ఆమోదించకుం డా జాప్యం చేసినట్లు తేలితే తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 ప్రకారం తగిన చర్యలు తీసుకో వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఉప సర్పంచ్ సరైన కారణం లేకుండా జాప్యం చేసినట్లు తేలితే చెక్పవరు పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ, ఎంపీడీవో తదితర అధికారుల్లో ఎవరో ఒకరికి కలెక్ట ర్ అప్పగించనున్నారు.