హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించే స్పెషల్ టీజీటెట్–2 నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల 7 నుంచి 16 వరకు అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in ద్వారా ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, టెట్ కన్వీనర్ గాజర్ల రమేశ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం టీచర్లు ప్రస్తుత పోస్టుల్లో కొనసాగాలన్నా, పై పోస్టులకు ప్రమోషన్ పొందాలన్నా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఈ ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తున్నారు. నవంబర్ 16 నుంచి 21వరకు ఆన్ లైన్లో పరీక్ష నిర్వహిస్తారు.
ఈ స్పెషల్ టెట్ కేవలం సర్వీస్ కొనసాగింపు, ప్రమోషన్లకు మాత్రమే ఉపయోగపడుతుందని, ఎలాంటి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్లకు చెల్లదని ఆఫీసర్లు స్పష్టం చేశారు. ఎగ్జామ్ ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.వెయ్యి చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ. 950 ఫీజుగా నిర్ణయించారు. మొత్తం 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో.. జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 60 మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ మధ్య ఫలితాలు విడుదల చేయనుండగా, ఉత్తీర్ణత సాధించిన వారికి ఇచ్చే సర్టిఫికెట్ లైఫ్‌టైమ్ చెల్లుబాటవుతుందని ఆఫీసర్లు వెల్లడించారు.
