- తొలిరోజే నాన్–--కాంప్లికేటెడ్ ఆపరేషన్ పూర్తి
- విడతల వారీగా కాంప్లికేటెడ్ సర్జరీలకు ప్లాన్
- కల్చర్ టెస్టుల రిపోర్టుల అనంతరమే ఓటీల ప్రారంభం
- అందుబాటులోకి నాలుగు ఆపరేషన్ థియేటర్లు
- నిత్యం 800 నుంచి 1,000 వరకు ఓపీలు నమోదు
- గాంధీ, ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్స్‌పై తగ్గనున్న భారం
హైదరాబాద్, వెలుగు: సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) దవాఖానలో సర్జరీ సేవలు ప్రారంభమయ్యాయి. హాస్పిటల్ ప్రారంభమైన నెలన్నర రోజుల తర్వాత గురువారం ఆపరేషన్ల ప్రక్రియను డాక్టర్లు మొదలుపెట్టారు. మొదటి రోజే నాన్-కాంప్లికేటెడ్ సర్జరీని వైద్యుల బృందం విజయవంతం చేసింది. సర్జరీ అనంతరం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే, హాస్పిటల్‌లో ఓపీ సేవలు ఇదివరకే ప్రారంభమైనప్పటికీ ఆపరేషన్లు మొదలుపెట్టేందుకు కొంత సమయం పట్టింది. ఇది కొత్త నిర్మాణం కావడంతో ఆపరేషన్ థియేటర్లను నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్ చేయాల్సి వచ్చింది. పేషెంట్లకు ఇన్ఫెక్షన్లు రాకుండా అంతర్జాతీయ ప్రొటోకాల్స్ ప్రకారం గాలి నాణ్యత, మైక్రోబియల్ కల్చర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ల్యాబ్ పరీక్షల రిపోర్టులన్నీ నెగెటివ్ వచ్చి, థియేటర్లు పూర్తిగా సురక్షితమని నిర్ధారణ అయిన తర్వాతే సర్జరీలకు అనుమతించారు.
పెరుగుతున్న ఓపీ.. డయాగ్నస్టిక్స్..
సనత్‌నగర్ టిమ్స్‌లో మే నెలలోనే ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో రోజుకు 500 వరకు ఉన్న ఔట్‌పేషెంట్ తాకిడి.. ప్రస్తుతం రోజుకు 800 నుంచి 1,000 పైగా నమోదవుతోంది. నిత్యం 30 మందికి పైగా డే కేర్ సేవలు పొందుతుండగా, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లు 150 నుంచి 200 వరకు జరుగుతున్నాయి. ప్రతిరోజూ వందకు పైగా అల్ట్రాసౌండ్ (యూఎస్జీ), ఎక్స్-రేలు, 50 వరకు ఈసీజీలు, పదుల సంఖ్యలో సీటీ, ఎంఆర్ఐ స్కాన్లు చేస్తున్నారు. ఇటీవల కిడ్నీ రోగుల కోసం డయాలసిస్, గుండె జబ్బుల నిర్ధారణకు 2డీ ఎకో సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
గాంధీ, ఉస్మానియాలపై తగ్గనున్న భారం..
టిమ్స్‌లో సర్జరీలు ప్రారంభమవుతుండటంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్స్‌పై ఆపరేషన్ల వెయిటింగ్ లిస్ట్ భారం తగ్గనుంది. ఆయా హాస్పిటల్స్‌లో సాధారణ సర్జరీల కోసం కూడా రోగులు ఎక్కువ కాలం వేచి చూడాల్సి వస్తోంది. టిమ్స్‌లో శస్త్రచికిత్స సేవలు విస్తరిస్తే రోగులకు వేగంగా ఆపరేషన్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతానికి నాలుగు ఓటీలు సిద్ధం..
ప్రస్తుతానికి దవాఖానలో నాలుగు ఆపరేషన్ థియేటర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టిమ్స్ అధికారులు వెల్లడించారు. వీటిలో ఆధునిక సర్జికల్ పరికరాలు, అనస్థీషియో వర్క్‌స్టేషన్లు, వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ నాలుగు ఓటీల్లో సాధారణ సర్జరీలు, చిన్నపాటి ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు. మిగిలిన విభాగాలకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లను కూడా త్వరలోనే సిద్ధం చేసేందుకు పనులు స్పీడప్ చేశారు. ప్రస్తుతం సాధారణ సర్జరీలను మొదలుపెట్టిన యాజమాన్యం, విడతలవారీగా కాంప్లికేటెడ్ సర్జరీలను కూడా ప్రారంభించేలా ప్లాన్ చేసింది.
