ఆ ఒక్క బటన్..  174 మందికి ప్రాణభిక్ష 

ఆ ఒక్క బటన్..  174 మందికి ప్రాణభిక్ష 
  •     గాయాలతో కాక్ పిట్ తలుపు తెరిచిన భారత పైలట్
  •     కో-పైలట్‌‌‌‌ను అడ్డుకొని కట్టేసిన ప్రయాణికులు
  •     అత్యవసర చికిత్స చేసిన డెంటిస్ట్ ముసావ్ షోటో
  •     ‘ఫ్లై దుబాయ్​’ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు
  •     నాపై తీవ్రంగా దాడి చేశాడు
  •     మచ్చర్ గాయాలతో మాట్లాడిన వీడియో రిలీజ్​
  •     స్మిత్ మచ్చర్​కు ప్రపంచవ్యాప్త ప్రశంసలు 
  •     ముర్ము, మోదీ, నెతన్యాహు, ట్రంప్ అభినందనలు


 
రియాద్: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి సౌదీ అరేబియాలో చికిత్స పొందుతున్న భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌‌‌‌ను మెరుగైన వైద్యం కోసం అధికారులు గురువారం అబుదాబికి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్ట్ చేశారు. బుధవారం దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఇజ్రాయెల్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ కత్తితో దాడి చేయగా..మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఆయన తన ప్రాణాలను లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి, కాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిట్ తలుపు తెరిచే బటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నొక్కారు. దాంతో విమానం కూల్చాలని ప్రయత్నించిన కో-పైలట్ ను ప్యాసింజర్లు అడ్డుకున్నారు. ఆ వెంటనే విమానంలోని ఇతర పైలట్లు విమానాన్ని సౌదీలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో 174 మంది ప్రాణాలు దక్కాయి. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన మచ్ఛార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సౌదీ మిలిటరీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇప్పుడు తదుపరి వైద్యం కోసం యూఏఈకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సౌదీలోని భారత ఎంబసీ వెల్లడించింది. 

తల, చేతులు దాదాపుగా తెగిపోయాయి

కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన పైలట్ స్మిత్ మచ్ఛార్ ప్రాణాలను విమానంలోనే ప్రయాణిస్తున్న ఒకేఒక్క డాక్టర్ ఇజ్రాయెలీ డెంటిస్ట్ ముసావ్ షోటా కాపాడారు. దాడిలో పైలట్ మచ్ఛార్ తల, చేతులు దాదాపు తెగిపోయినట్లు డెంటిస్ట్ తెలిపారు. విపరీతంగా రక్తం కారిపోతూ, స్పృహ కోల్పోతున్నా పైలట్ వీరోచింతంగా పోరాడారని వెల్లడించారు. 35 వేల అడుగుల ఎత్తులో సరైన పరికరాలు లేకపోయినా మచ్ఛార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముసావ్ ప్రథమ చికిత్స అందించి రక్తస్రావాన్ని అరికట్టారు. పైలట్ బ్లడ్ ప్రెషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్ చేసి అతని ప్రాణాలను కాపాడారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేసి స్థానిక వైద్య బృందంతో  చికిత్స అందించారు. 

దర్యాప్తు ముమ్మరం

కో-పైలట్ జరిపిన కత్తిపోట్ల దాడిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉగ్రవాదం నుంచి మానసిక రుగ్మతల వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని..ఇన్వెస్టిగేషన్‌‌లో సౌదీతో పాటు ఇజ్రాయెల్, అమెరికా దేశాలు  భాగస్వామ్యం అయ్యాయని అధికారులు తెలిపారు. కో-పైలట్ ను విచారించడంలో సాయం చేయడానికి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ అధికారులు ఇప్పటికే సౌదీ అరేబియా చేరుకున్నారు. దర్యాప్తు కోసం నిందితుడిని  తమ దేశానికి పంపాలని ఇజ్రాయెల్ కోరినప్పటికీ.. ఆ అభ్యర్థనకు అనుమతి లభిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదని అధికారులు చెప్పారు.

సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ.. ఆ రెండు దేశాలు చాలా కాలంగా  భద్రత, ఇంటెలిజెన్స్ విషయాల్లో సహకరించుకుంటున్నాయి. ఘటనకు దారితీసిన పరిస్థితులు, కారణాలపై దర్యాప్తు చేయడానికి నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను యూఏఈ అటార్నీ జనరల్ కౌన్సిలర్ హమద్ అల్ షంసీ ఆదేశించారు. విమానం తమ దేశంలోనే రిజిస్టర్ అయిందని.. తమ దేశ జెండాతోనే నడుస్తున్నది కాబట్టి చట్టాల ప్రకారం దర్యాప్తుపై యూఏఈ న్యాయస్థానాలకే అధికార పరిధి ఉందని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. విమానం తమ దేశం బయట ఉన్నప్పటికీ ..అందుల జరిగే నేరాలకు యూఏఈ చట్టమే వర్తిస్తుందని పేర్కొంది.   


దాడి చేసింది గొడ్డలితోనే? 

ఫ్లైదుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడి ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మచ్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సహ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొడ్డలి (క్రాష్​ యాక్స్)తో దాడి చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. తొలుత కత్తితో పొడిచినట్లు వార్తలు వచ్చినప్పటికీ, విమానంలోనే అత్యవసర అవసరాల కోసం ఉంచే క్రాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దాడి చేసి ఉండొచ్చని సీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కథనం వెల్లడించింది. ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాని బెంజమిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెతన్యాహు కూడా దాడికి క్రాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపయోగించినట్లు పేర్కొన్నారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  వాణిజ్య విమానాల్లో తప్పనిసరిగా ఉంచుతారు.

అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం విమాన తయారీ సమయంలోనే వీటిని అమర్చుతారు. గతంలో ప్రయాణికుల క్యాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచే ఈ పరికరాలను 2001 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11 ఉగ్రదాడుల తర్వాత పైలెట్లకు అందుబాటులో ఉండేలా కాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మార్చినట్లు కథనాలు పేర్కొంటున్నారు. కాగా, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన నిందితుడు ఇస్లామిస్ట్ రాడికల్ భావజాలంతో ప్రభావితుడయ్యాడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. యూఏఈ జరుపుతున్న దర్యాప్తునకు ఇజ్రాయెల్ పూర్తి సహకారం అందిస్తుందని, త్వరలోనే అన్ని నిజాలు వెలుగులోకి తెస్తామని వెల్లడించారు.