ఖాళీ అయ్యే స్థానాలు నోటిఫికేషన్‌‌కు ముందే విచారిస్తాం : సుప్రీంకోర్టు

ఖాళీ అయ్యే స్థానాలు నోటిఫికేషన్‌‌కు ముందే విచారిస్తాం : సుప్రీంకోర్టు
  • గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు స్పష్టం
  • నవంబర్ 18న వెరీ హై ఆన్ బోర్డులో విచారణ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై దాఖలైన పిటిషన్లను నవంబర్‌‌లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చేలోపే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును నవంబర్ 18న వెరీ హై ఆన్ బోర్డులో విచారిస్తామని పేర్కొంటూ గురువారం విచారణను వాయిదా వేసింది. గతంలో బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేసింది.

అయితే రాజకీయ కోణం ఉందంటూ అప్పటి గవర్నర్ తమిళిసై ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను సిఫార్సు చేయగా.. గవర్నర్ ఆమోదించారు. ఈ నియామకాలను సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2025 ఆగస్టు 13న సుప్రీంకోర్టు కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.

దీనిపై అమీర్ అలీఖాన్ 2025 డిసెంబర్ 5న ఐఏ నంబర్ 316134/2025తో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను గురువారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణలో నవంబర్‌‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అమీర్ అలీఖాన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ ఎం. నులి వాదిస్తూ.. ప్రస్తుతం ఐఏ నంబర్ 316134/2025పై తాము ముందుకు వెళ్లడం లేదని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. నవంబర్ 18న విచారణ చేపడతామని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ మరోసారి ప్రొ. కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేయగా గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు.