- కొండాపూర్‌లో 300 గజాల భూమి సేఫ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: పాతబస్తీలోని శివరాంపల్లిలో చారిత్రక బుమ్ రుక్న్ ఉద్ దౌలా చెరువు కింద ఉన్న పురాతన ఊటబావికి హైడ్రా పునర్జీవాన్నిస్తోంది. సుమారు 1.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బావి పునరుద్ధరణ పనులను ప్రారంభించిన హైడ్రా మరో రెండు, మూడు నెలల్లో పూర్తి చేయనున్నది. నిజాం కాలంలో ఈ బావి నీటిని చుట్టుపక్కల వారంతా తాగేవారని, ఎన్నో ఔషధ గుణాలు ఉండేవని స్థానికులు చెప్తున్నారు. కాలక్రమంలో చెత్త, ప్లాస్టిక్, మట్టి, ఒండ్రుమట్టి, పిచ్చిమొక్కలతో పూడుకుపోయిందని, వాటిని తొలగించి ఈ బావికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు హైడ్రా పనులు చేపట్టడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుమ్ రుక్న్ ఉద్ చెరువు అభివృద్ధి చేసే టైంలో ఈ బావి గురించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో ప్రస్తుతం బావి పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.
ఇస్తారిబాయి కుంటకు రక్షణ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులోని ఇస్తారిబాయి కుంటను హైడ్రా రక్షించింది. సర్వే నంబర్ 248లోని 2.5 ఎకరాల ప్రభుత్వ భూమి పరిధిలో ఉన్న ఈ కుంటను ఇరిగేషన్, హెచ్‌ఎండీఏ గుర్తించాయి. కుంటకు ఆనుకుని రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసి, చెరువులోకి వచ్చి నిర్మించిన ప్రహరీని హైడ్రా గురువారం తొలగించింది. చెరువు కట్టను ఆనుకుని బఫర్ జోన్‌లో ఆర్‌ఎంసీ ప్లాంట్ కార్మికుల కోసం నిర్మించిన షెడ్లను తీసేసింది. కుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
కుడికుంట 300 గజాలు..
శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని కుడికుంటకు చెందిన 300 గజాల మిగులు భూమిని కూడా హైడ్రా కాపాడింది. 8 ఎకరాల విస్తీర్ణంలోని కుడికుంటను ఇప్పటికే సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్ అభివృద్ధి చేసింది. చెరువు కింది భాగంలో నీరు లేక ఖాళీగా ఉన్న 300 గజాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా పరిశీలనలో అది కుడికుంటకు చెందిన భూమిగా నిర్ధారించడంతో హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణలకు అడ్డుకట్ట వేసింది.
