- నెక్లెస్ రోడ్లో సెల్‌ఫోన్ల ఫ్లాష్ లైట్లతో లైట్ మార్చ్
- పాల్గొన్న నటుడు అడవి శేషు, డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవచ్చని, ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చని సినీ నటుడు అడవి శేషు సూచించారు. అక్టోబర్ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్‌లో భాగంగా.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద 'సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్-పాజ్ ఫర్ సేఫ్టీ' పేరిట 2 కిలోమీటర్ల నైట్ వాక్ నిర్వహించారు. డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్‌తో కలిసి అడవి శేషు ఈ కార్యక్రమంలో పాల్గొని సెల్‌ఫోన్ల ఫ్లాష్ లైట్లతో లైట్ మార్చ్ ప్రారంభించారు. ఈ మార్చ్‌లో విద్యార్థులు, పోలీసులు, వలంటీర్లు సహా దాదాపు 3 వేల మంది పాల్గొన్నారు.
డీజీపీ మాట్లాడుతూ.. గతేడాది సైబర్ నేరగాళ్లు రూ.1800 కోట్లు కాజేశారని, ఈ ఏడాది ఇప్పటికే 45 వేల ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో క్లిక్ లేదా షేర్ చేసే ముందు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయెల్ మాట్లాడుతూ.. 'ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి' అనే నినాదంతో అక్టోబర్ అంతటా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 31న రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్‌లతో ఈ మాసాన్ని ముగిస్తామని పేర్కొన్నారు.
