- ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు కామన్ వ్యాలిడేషన్ రూల్స్ తెచ్చిన బోర్డు
- ఈ విద్యా సంవత్సరం నుంచే 20 శాతం ఇంటర్నల్ మార్కులు
- యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఆధారంగానే ఇంటర్నల్స్ మూల్యాంకనం
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ లో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల కేటాయింపులో కాలేజీల ఇష్టారాజ్యానికి, మార్కుల గోల్‌మాల్‌కు చెక్ పెట్టేందుకు ఇంటర్ బోర్డు కొత్త రూల్స్ తెచ్చింది. కాలేజీల చేతివాటానికి కళ్లెం వేస్తూ అత్యంత పకడ్బందీగా కామన్ వ్యాలిడేషన్ రూల్స్ తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం (2026–27) నుంచే ఇంటర్ ఫస్టియర్‌లో 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సవరించిన సిలబస్, కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ ను కాలేజీలకు ఇంటర్ బోర్డు పంపించింది.
యాక్టివిటీ ఆధారంగానే మూల్యాంకనం
ఇంటర్నల్స్ మార్కులు కాలేజీల చేతుల్లోనే ఉండటంతో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు తమ విద్యార్థులకు ఇష్టమొచ్చినట్లు మార్కులు వేసుకునే ప్రమాదం ఉందన్న విమర్శలు ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. లెక్చరర్లు తమ ఇష్టమొచ్చినట్లు కాకుండా సవరించిన పాఠ్యపుస్తకాల్లో సూచించిన యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఆధారంగానే విద్యార్థులను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.
మార్కుల కేటాయింపునకు సంబంధించిన ఆధారాలు, రికార్డులను కాలేజీల్లో పక్కాగా భద్రపరచాలి. బోర్డు తనిఖీల్లో తేడాలు వస్తే చర్యలు తీసుకోనున్నారు. కేవలం పరీక్షల కోసమే కాకుండా విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, రీజనింగ్, క్రియేటివిటీ, వ్యక్తిత్వ వికాసాన్ని పరీక్షించేలా ఈ అసెస్‌మెంట్లు సాగాలని బోర్డు పేర్కొంది.
ఫస్టియర్‌లోనే ప్రాక్టికల్స్..
ఇప్పటిదాకా సెకడింయర్ లోనే నిర్వహిస్తున్న సైన్స్ ప్రాక్టికల్స్ విధానాన్ని ఇంటర్ బోర్డు మార్చేసింది. సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) విద్యార్థులకు ఫస్టియర్‌లో15 మార్కులకు ఎక్స్‌టర్నల్ ప్రాక్టికల్ పరీక్ష ను ప్రవేశపెట్టింది. వీరికి థియరీ పరీక్షను 60 మార్కులకే పరిమితం చేసింది. ప్రయోగాల నిర్వహణ కోసం వేర్వేరుగా ప్రాక్టికల్ మాన్యువల్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. సీఈసీ, హెచ్‌ఈసీ (ఆర్ట్స్) గ్రూపుల్లోని కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ తదితర హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఉంటుంది.
సీఈసీ గ్రూపులో కామర్స్ (40 థియరీ + 10 ఇంటర్నల్స్), అకౌంటెన్సీ (40 థియరీ + 10 ఇంటర్నల్స్)గా విభజించారు. లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ తదితర అన్ని భాషా సబ్జెక్టులకు 80 మార్కుల థియరీ, 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ విధానాన్ని అమలు చేయనున్నారు. మ్యాథ్స్ లో ఎంపీసీలో మ్యాథ్స్ ఏ, బీ లకు 60 మార్కుల థియరీ, 15 మార్కుల ఇంటర్నల్స్ ఉండగా.. ఎంఈసీ విద్యార్థులకు ప్రత్యేకంగా వంద మార్కుల పేపర్‌ను (80 థియరీ + 20 ఇంటర్నల్స్) తీసుకొచ్చారు.
ఇంగ్లీష్ పుస్తకాల విలీనం..
పార్ట్-1 ఇంగ్లీష్ ఫస్టియర్ విద్యార్థులకు సంబంధించి పుస్తకాల్లో కీలక మార్పు చేశారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్నఇంటరాక్టివ్ ఇంగ్లీష్ టెక్స్ట్‌బుక్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ మాన్యువల్‌ను విలీనం చేసి ఒకటే పుస్తకంగా ప్రింట్ చేశారు. సెకండియర్ లో మాత్రం రెండు వేర్వేరు పుస్తకాలే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
నవంబర్ లోపు ఇంటర్నల్స్ పూర్తి చేయాలి
రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలు కామన్ వ్యాలిడేషన్ రూల్స్ తప్పకుండా పాటించాలి. ఇప్పటివరకు ఏ కాలేజీ అయినా ఇంటర్నల్ అసెస్‌మెంట్లు నిర్వహించకపోతే, వన్‌టైమ్ మినహాయింపు కింద నవంబర్ లోపు కచ్చితంగా పూర్తి చేయాలి. విద్యార్థుల ప్రాజెక్టులు, అసైన్‌మెంట్ల రికార్డులను ప్రిన్సిపాళ్లు స్వయంగా వెరిఫై చేసిన తర్వాతే మార్కులను బోర్డుకు పంపాలి. నిబంధనలు, ఎఫ్‌ఏక్యూల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tgbienew.cgg.gov.in/ ను పరిశీలించాలి.~అభిలాష అభినవ్ , బోర్డు సెక్రెటరీ
