జీఎస్టీ వసూళ్లలో  తెలంగాణ దూకుడు..  సెప్టెంబర్ లో 18శాతం  గ్రోత్  నమోదు

జీఎస్టీ వసూళ్లలో  తెలంగాణ దూకుడు..  సెప్టెంబర్ లో 18శాతం  గ్రోత్  నమోదు
  •    జీఎస్టీ రెవెన్యూ రూ.5,327 కోట్లు
  •     సెప్టెంబర్ వసూళ్ల ను వెల్లడించిన కేంద్రం  

న్యూఢిల్లీ, వెలుగు: గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లలో తెలంగాణ మరోసారి భారీ గ్రోత్ ను నమోదు చేసింది. సెప్టెంబర్ లో రూ.5,327 కోట్ల జీఎస్టీ వసూళ్లను సాధించింది. గత ఏడాది సెప్టెంబర్​లో రూ.4,512 కోట్లు జీఎస్టీ రూపంలో వసూళ్లయ్యాయి. గతేడాది సెప్టెంబర్ తో పోల్చితే రూ.815 కోట్లు అధికంగా వసూళ్లు చేసి..18 శాతం వృద్ధి సాధించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్ల వివరాలను వెల్లడించింది. సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రూపంలో రూ.37,762 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూపంలో రూ.45,363 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూపంలో రూ.1,20,396 కోట్లు వసూళ్లు అయ్యాయి. ఇందులో దిగుమతుల రూపంలో రూ.65,525కోట్లు ఉన్నాయి. మొత్తంగా సెప్టెంబర్​లో  దేశ వ్యాప్తంగా రూ.2,03,521 కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు తెలిపింది. గతేడాది ఇదే నెలలో రూ.1,77,365 కోట్లు జీఎస్టీ రూపంలో సమకూరినట్లు తెలిపింది. ఈ లెక్కన ప్రస్తుతం 14.7 శాతం గ్రోత్ నమోదైనట్లు గణాంకాలు వెల్లడించాయి. అధిక దేశీయ, దిగుమతి రాబడుల కారణంగా ఈ పెరుగుదల నమోదైంది. ఏప్రిల్ –సెప్టెంబర్ మధ్య స్థూల జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం పెరిగి,  రూ.1246,278 కోట్లకు చేరుకున్నాయి. జూన్ నెలలో గ్రాస్ డొమెస్టిక్ రెవెన్యూ రూ.1,34,774 కోట్లుతో గతేడాదితో పోల్చితే 6.5 శాతం పెరుగుదను నమోదు చేసింది. సెప్టెంబర్‌‌లో రీఫండ్‌‌లు గతేడాదితో పోలిస్తే 3% తగ్గి రూ.27,001 కోట్లకు చేరాయి. మొత్తం నికర జీఎస్టీ ఆదాయం ఏడాదివారీగా 18.1% పెరిగి రూ.1,76,520కి చేరింది.

వసూళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానం

దేశీయ జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది సెప్టెంబర్ తో పోల్చితే 15 శాతం గ్రోత్ తో రూ.29, 986 కోట్ల వసూళ్లతో ముందజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నాటక 16% వృద్ధిని నమోదు చేస్తూ రూ.13,884 కోట్ల వసూళ్లతో తర్వాతి స్థానంలో నిలవగా, గుజరాత్ జీఎస్టీ ఆదాయం 17% పెరిగి రూ.12,222 కోట్లకు చేరింది. ఉత్తర ప్రదేశ్ జీఎస్టీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంలోని రూ. 7,516 కోట్ల నుంచి 2026 సెప్టెంబర్ నాటికి 18% పెరిగి రూ. 8,882 కోట్లకు చేరింది. పంజాబ్ జీఎస్టీ ఆదాయం 18% పెరిగి రూ. 2,549 కోట్లకు ఎగబాకింది. అస్సాం జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే 88% పెరిగి రూ. 1,287 కోట్ల నుండి రూ. 2,415 కోట్లకు చేరాయి. మణిపూర్ 145% పెరుగుదలతో రూ.92 కోట్లకు చేరగా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వరుసగా 46% ,39% వృద్ధిని నమోదు 
నమోదు చేశాయి. 

సిక్కింలో తగ్గుదల

సెప్టెంబర్ నెలలో పలు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. సిక్కింలో అత్యంత తీవ్రమైన తగ్గుదల కనిపించింది. ఈ రాష్ట్రంలో ఆదాయం 51% తగ్గి రూ.194 కోట్లకు పడిపోయింది. జమ్మూ – కాశ్మీర్ వసూళ్లు 29% తగ్గి రూ.487 కోట్లకు చేరగా, ఉత్తరాఖండ్ 23% తగ్గి రూ.1,277 కోట్లకు, హిమాచల్ ప్రదేశ్ 21% తగ్గి రూ.640 కోట్లకు పడిపోయాయి. తమిళనాడు జీఎస్టీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 5% తగ్గి రూ.10,188 కోట్లకు చేరగా, గోవా వసూళ్లు 7% తగ్గి రూ.494 కోట్లకు పడిపోయాయి. పుదుచ్చేరిలో 31% క్షీణతతో రూ.179 కోట్లు, మేఘాలయలో వసూళ్లు 14% తగ్గి రూ.164 కోట్లకు చేరాయి. ఇతర ప్రధాన రాష్ట్రాలలో, కేరళ జీఎస్టీ ఆదాయంలో 11% వృద్ధిని నమోదు చేసి రూ.3,328 కోట్లకు, పశ్చిమ బెంగాల్ 6% వృద్ధితో రూ.5,549 కోట్లకు, ఒడిశా 10% వృద్ధితో రూ.4,356 కోట్లకు, మధ్యప్రదేశ్ 5% వృద్ధిని నమోదు చేసి రూ.3,198 కోట్లకు చేరాయి. రాజస్థాన్ వసూళ్లు గతేడాది రూ.4,165 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ. 4,151 కోట్ల వద్ద దాదాపుగా స్థిరంగా నిలిచింది.