22 లక్షల కోట్లు ఆవిరి .. నెల రోజుల్లో తీవ్రంగా నష్టపోతున్న ఇన్వెస్టర్లు

22 లక్షల కోట్లు ఆవిరి .. నెల రోజుల్లో  తీవ్రంగా నష్టపోతున్న ఇన్వెస్టర్లు
  • ఎఫ్​ఐఐల అమ్మకాలతో మార్కెట్లు విలవిల​
  • సెన్సెక్స్​ మరో 570 పాయింట్లు డౌన్
  • నాలుగో రోజూ నష్టాల బారిన పడ్డ మార్కెట్
  • ఏడాది కనిష్టానికి పడిపోయిన సెన్సెక్స్​


 
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు గత నెల ఇన్వెస్టర్లకు ఏకంగా రూ.22 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. ఈ నెల తొలిరోజూ లాసులతోనే మొదలయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, ఎఫ్​ఐఐల అమ్మకాల ఆగకపోవడంతో గురువారం  సెన్సెక్స్ 570.59 పాయింట్లు క్షీణించి 71,909.70 వద్ద ఆగింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో ఏకంగా 1,187.41 పాయింట్లు నష్టపోయి 52 వారాల కనిష్ట స్థాయి అయిన 71,292.88 పాయింట్లను తాకింది.  నిఫ్టీ  198.50 పాయింట్లు తగ్గి 22,421.95 వద్ద ముగిసింది.  ఇది గత 25 ఏళ్లలో తొలిసారి వరుసగా ఎనిమిదో వారమూ నష్టపోయింది. దీంతో మదుపరుల సంపద రూ.2.80 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్​లో మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్ నష్టపోగా... ఇన్ఫోసిస్, టీసీఎస్​, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్​ఐఐలు) బుధవారం రూ.10,148.41 కోట్ల విలువైన షేర్లను, గురువారం రూ.9,159.99 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ వారంలో సెన్సెక్స్ 1,986.04 పాయింట్లు, నిఫ్టీ 718.55 పాయింట్లు తగ్గింది.    డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 37 పైసలు తగ్గి 96.25 వద్ద ముగిసింది. ఇది గత రెండు నెలల్లోనే అత్యంత కనిష్ట స్థాయి.   ఒకదశలో 96.34 స్థాయికి పడిపోయింది. 


మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు:

బాండ్ల రాబడుల దెబ్బ: అమెరికా ప్రభుత్వ పదేళ్ల బాండ్ రాబడులు 5.34 శాతానికి పైగా పెరిగాయి. ఇది 30 ఏళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. దీనివల్ల ఎఫ్​ఐఐలు రిస్క్ ఎక్కువగా ఉండే భారత మార్కెట్ల నుంచి  నిధులను వెనక్కి తీసుకుని, సురక్షితమైన అమెరికా డాలర్ ఆస్తుల వైపు మళ్లారు.

ముడి చమురు సెగ: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌‌‌‌కు 100.8 డాలర్ల పైకి చేరింది. సెప్టెంబర్ నెలలోనే బ్రెంట్ క్రూడ్ ధరలు ఏకంగా 28.66 శాతం మేర పెరిగాయి. మనదేశం తన అవసరాల కోసం 85 శాతం పైగా చమురును దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, ఈ ధరల పెరుగుదల వల్ల  ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువ అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మితిమీరిన షేర్ల ధరలు: గత కొంతకాలంగా భారత స్టాక్ మార్కెట్లో, ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల షేర్ల ధరలు వాటి వాస్తవ విలువల కంటే చాలా ఎక్కువగా ట్రేడ్ అయ్యాయి. మార్కెట్ బాగా ఖరీదుగా మారడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లాభాలను స్వీకరిస్తూ పెద్ద ఎత్తున షేర్లను విక్రయించారు.

రంగాల వారీగా ప్రభావం: ఎఫ్​ఐఐల అమ్మకాల వల్ల బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలపై ప్రభావం చాలా ఎక్కువగా పడింది. విదేశీ పెట్టుబడిదారులకు ఈ రంగాలోనే అత్యధిక పెట్టుబడులు ఉండటమే దీనికి కారణం. అయితే బ్యాంకింగ్ రంగంతో పోలిస్తే ఐటీ, టెలికమ్యూనికేషన్స్ రంగాలు కొంతవరకు తట్టుకుని లాభాల్లో ముగిశాయి.

అమ్మకాలు ఆగడం కష్టమేనా?

ఇకముందు కూడా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్​పర్ట్స్​ భావిస్తున్నారు. మార్కెట్ తిరిగి పుంజుకోవాలంటే బాండ్ రాబడులు ప్రస్తుత గరిష్ట స్థాయి నుంచి తగ్గాలి. అలాగే క్రూడ్ ధరలు 100 డాలర్ల లోపుకు వస్తేనే దేశీయ ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. గ్లోబల్ హెడ్జ్ ఫండ్స్ మళ్లీ పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీల త్రైమాసిక లాభాలు పెరిగి, షేర్ల ధరలు సహేతుకమైన స్థాయికి రావాలి.

ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి ?

ఇలాంటి సమయంలో సాధారణ ఇన్వెస్టర్లు కంగారు పడటం సహజం. స్వల్పకాలిక ఒడిదుడుకులకు భయపడి షేర్లను అమ్మేయడం సరైన పద్ధతి కాదని స్టాక్​ మార్కెట్​ ఎనలిస్టులు అంటున్నారు. లాంగ్​టర్మ్​ ఇన్వెస్టర్లు ఇటువంటి కరెక్షన్​ సమయంలో మంచి కంపెనీల షేర్లను తక్కువ ధరలకు కొనవచ్చు. బాగా రాణిస్తున్న కంపెనీలలో క్రమబద్ధమైన పెట్టుబడి విధానం ద్వారా ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాలు పొందవచ్చని చెబుతున్నారు.