పోలీస్ కమిషన రేట్లలో కొత్త జోన్లు, డివిజన్ల పై జీవో

పోలీస్ కమిషన రేట్లలో  కొత్త జోన్లు, డివిజన్ల పై జీవో
  • జీహెచ్‌‌ఎంసీ పునర్​ వ్యవస్థీకరణకు అనుగుణంగా  మార్పులు   బడంగ్‌‌ పేట్ పోలీస్‌‌ స్టేషన్ ప్రతిపాదన రద్దు

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌ పోలీస్​కమిషనరేట్ల పునర్‌‌ వ్యవస్థీకరణపై రాష్ట్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌‌, మేడ్చల్ మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధి, జోన్లు, డివిజన్లు, పోలీస్‌‌స్టేషన్ల సరిహద్దుల్లో మార్పుచేర్పులకు ఆమోద ముద్ర వేస్తూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్‌‌ మూడు వేర్వేరు జీవోలను జారీ చేశారు. బడంగ్‌‌పేట పోలీస్‌‌స్టేషన్‌‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు విరమించుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్‌‌ఎంసీ పునర్‌‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో దానికి అనుగుణంగా పోలీస్‌‌ కమిషనరేట్లలోనూ మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబర్‌‌‌‌లో ఆదేశాలిచ్చింది. మూడు కమిషనరేట్లను పునర్‌‌ వ్యవస్థీకరించిహైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌‌సిటీ కమిషనరేట్లుగా మార్చింది. 

హైదరాబాద్‌‌ కమిషనరేట్‌‌ లో ఇలా.. 

ఆర్‌‌జీఐఏ డివిజన్‌‌ పేరును శంషాబాద్‌‌గా మార్చారు. అలాగే, చిక్కడపల్లి డివిజన్‌‌ పేరును కాచిగూడ డివిజన్‌‌ గా,  సంతోష్‌‌నగర్‌‌ డివిజన్‌‌ ను ఛత్రినాక డివిజన్‌‌గా మార్చి, నార్త్‌‌జోన్‌‌ మహిళా పోలీస్‌‌స్టేషన్‌‌ ను మల్కాజిగిరి కమిషనరేట్‌‌కు బదిలీ చేశారు. మార్కెట్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌.. మేడ్చల్‌‌ మల్కాజిగిరి పరిధిలోకి వెళ్లింది. రాజేంద్రనగర్, పహాడీషరీఫ్, మీర్‌‌పేట పోలీస్ స్టేషన్లు హైదరాబాద్​సిటీ పోలీస్​కమిషనరేట్​పరిధిలోకి వచ్చాయి.

సైబరాబాద్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో..

అమీన్‌‌పూర్‌‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలను ఐడీఏ బొల్లారం పరిధిలోకి తెచ్చారు. మోకిల పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోని జన్వాడ.. నార్సింగి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోకి తెచ్చారు. నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్షాకోట్‌‌ వార్డు గంధంగూడ, బైరాగిగూడ, పీరం చెరువు, తెలంగాణ పోలీసు అకాడమీ, ఆర్మీ ఫైరింగ్‌‌ రేంజ్‌‌ ప్రాంతాలు రాజేంద్రనగర్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోకి వచ్చాయి. 

మేడ్చల్ మల్కాజిగిరి కమిషనరేట్‌‌ లో ఇలా..  

మల్కాజిగిరి కమిషనరేట్‌‌లో కొత్తగా ఉప్పల్‌‌ జోన్, అల్వాల్, మేడిపల్లి, ఉప్పల్‌‌ డివిజన్లు ఏర్పాటయ్యాయి. బేగంపేట జోన్‌‌ రద్దయింది. జవహర్‌‌‌‌నగర్‌‌‌‌ పరిధిలోని కౌకూరు గ్రామం బొల్లారం పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోకి వెళ్లింది.