పారిస్: వరల్డ్ నంబర్‌వన్, ఇటలీ స్టార్ ప్లేయర్ యానిక్ సినర్‌కు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. ఎండ తీవ్రతను తట్టుకోలేక బాగా అలసిపోయిన ఇటాలియన్ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. దాంతో గురువారం జరిగిన మ్యాచ్‌లో జువాన్ మాన్యుయెల్ సెరుండోల్ (అర్జెంటీనా) 3–6, 2–6, 7–5, 6–1, 6–1తో సినర్‌పై గెలిచాడు. ఫలితంగా సినర్ 30 వరుస విజయాలకు బ్రేక్ పడింది. 3 గంటలా 36 నిమిషాల మ్యాచ్‌లో సినర్ దాదాపు రెండు గంటల పాటు ఆధిపత్యం చూపెట్టాడు.
ఈ క్రమంలో మూడో సెట్‌లో 5–4తో సర్వీస్ చేసి విజయానికి అడుగు దూరంలో నిలిచాడు. కానీ ఒక్కసారిగా ఎండ 32 డిగ్రీలకు పెరగడంతో సినర్ తట్టుకోలేకపోయాడు. అలసటతో మైదానంలో వంగిపోతూ కదలడానికి కూడా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కళ్లు తిరగడం, వాంతులు వచ్చేలా ఉండటంతో అంపైర్ అనుమతితో కోర్టు వెలుపల చికిత్స తీసుకున్నాడు.
మెడకు ఐస్ ప్యాక్‌లు కట్టుకుని, మినరల్స్ తీసుకుని వచ్చినా ఫలితం లేకపోయింది. దాంతో ఓ దశలో వరుసగా 18 పాయింట్లు కోల్పోయాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న సెరుండోల్ సుదీర్ఘమైన ర్యాలీలు ఆడుతూ సినర్‌ను మరింత అలసిపోయేలా చేశాడు. మూడో సెట్ నెగ్గిన తర్వాత సెరెండోల్ మరింత రెచ్చిపోయాడు.
ఆఖరి రెండు సెట్లలో సినర్ కనీసం బాల్‌ను కూడా అందుకోలేకపోయాడు. దాంతో దూకుడుగా ఆడిన సెరుండోల్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.
విమెన్స్ సింగిల్స్‌లో అనిసిమోవా (అమెరికా) 6–0 ఉన్న దశలో జూలియా గ్రాబెర్ (ఆస్ట్రియా) మ్యాచ్ నుంచి వైదొలిగింది. దాంతో అమెరికన్‌కు వాకోవర్ విజయం లభించింది. నవోమి ఒసాకా (జపాన్) 7–6 (7/1), 6–4తో వెకిచ్ (క్రొయేషియా)పై నెగ్గింది.
