
Mutual Funds: కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రిటైల్ పెట్టుబడిదారులు పార్టిసిపేషన్ మారుతూ వస్తోంది. బుల్ ర్యాలీ కొనసాగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఈక్విటీల్లోకి భారీగా డబ్బును కుమ్మరించిన ఇన్వెస్టర్లు ఆ తర్వాత తమ ఎస్ఐపీలను క్రమంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది నిపుణులు మాత్రం ఇది సరైన నిర్ణయం కాదని, మార్కెట్ల పతనాన్ని లాభాలుగా మార్చుకునేందుకు ఉపయోగించుకోవాలని చాలా సార్లు చెబుతూనే వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఏప్రిల్ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు గురైనప్పటికీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మాత్రం తమ ఎస్ఐపీలను తిరిగి షురూ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎస్ఐపీల సంఖ్య ఏప్రిల్ నెలలో 3 శాతం పెరిగి రూ.26వేల 632 కోట్లకు చేరుకున్నాయి. అయితే వీటి విలువ మార్చి మాసంలో రూ.25వేల 962 కోట్లుగా ఉంది. అలాగే ఏప్రిల్ మాసంలో మెుత్తం ఫోలియోల సంఖ్య స్వల్పంగా పెరిగి 23కోట్ల 62లక్షల 95వేల 024కి చేరుకున్నాయి. ఈ క్రమంలో రిటైల్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోల సంఖ్య కూడా పెరుగుదలను చూసింది.
మెుత్తానికి ఏప్రిల్ మాసంలో రిటైల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ రూ.40లక్షల 29వేల 311 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో కొత్తగా ఎస్ఐపీ పెట్టుబడులు చేసేందుకు రిజిస్ట్రేషన్ల సంఖ్య 46 లక్షల మేర పెరుగుదలను చూసింది. ఏప్రిల్ నెలలో ఎస్ఐపీల విలువ సరికొత్త గరిష్ఠాలను తాకటం గమనార్హం. ప్రజల్లో పెట్టుబడులపై అవగాహన పెరగటంతో పాటు చిన్న మెుత్తాల్లో ఎస్ఐపీలను స్టార్ట్ చేసేందుకు అనేక ఏఎంసీలు వెసులుబాటు కల్పించటం కీలకంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలతో పాటు ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడులను స్వల్ప కాలంలో ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమయాల్లో కూడా సరైనా ఎంపికల ద్వారా పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లే ఇన్వెస్టర్లు భవిష్యత్తులో పరిస్థితులు చక్కబడిన తర్వాత ఉత్తమ రాబడులను చూస్తారని వారు చెబుతున్నారు.