శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే పానీయాలివే..

శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే పానీయాలివే..

ఈ చలికాలంలో వేడివేడిగా ఏదైనా తింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా. అయితే మనసుకు ఆనందంతో పాటు, ఆరోగ్యానికి మేలును కలగజేసే పానీయాలు తీసుకోవడమూ ముఖ్యమని నిపుణులు సలహా ఇస్తున్నారు. మామూలుగా అందరికీ తెలిసిన టీ, కాఫీలను పక్కన పెడితే.. ఈ లిస్ట్ లో ఇంకా ఏమేం ఉన్నాయి అన్న విషయానికొస్తే.. 

బాదం పాలు 

ముఖ్యంగా చలికాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన పానీయాలలో బాదం పాలు ఒకటి. బాదంపప్పును పాలలో వేసి కొన్ని నిమిషాలు ఉడకబెట్టడం ద్వారా దీనిని తయారుచేస్తారు. ఇది మరింత రుచిగా కావాలనుకుంటే పాలలో కుంకుమపువ్వును కూడా జోడించవచ్చు.

అల్లం టీ

అల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది బరువు తగ్గడానికి, శీతాకాలంలో వచ్చే అలర్జీలను నయం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ చలికాలంలో అల్లం టీని సిప్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా అల్లం, శరీరం వ్యాధుల బారిన పడకుండా సహాయపడుతుంది.

పసుపు పాలు 

హిందీలో హల్దీ దూద్ అని పిలువబడే పసుపు పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ పాలు శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గోల్డెన్ డ్రింక్ గా పిలుచుకునే ఈ పసుపు పాలు దగ్గు, జలుబును నయం చేయడంలోనూ సహాయపడుతుంది.

కాశ్మీరీ కహ్వా

సాధారణంగా కహ్వాను ట్రై చేయలేదంటే.. ఆ శీతాకాలం అసంపూర్ణంగా ఉంటుందని పలువురు అంటూ ఉంటారు. ప్రధానంగా కాశ్మీర్‌లో వినియోగించబడే ఈ వెచ్చని పానీయం గ్రీన్ టీ, కుంకుమపువ్వు, దాల్చినచెక్క, ఏలకులతో తయారు చేస్తారు. ఈ టీలో తియ్యగా ఉండేందుకు చక్కెర లేదా తేనెను వాడుతారు. దాంతో పాటు బాదంపప్పునూ వినియోగిస్తారు. దీంట్లో ఉంటే మసాలా దినుసులు ఉత్తేజకాలుగా పనిచేస్తాయి, చల్లని వాతావరణంలో మన శరీరానికి వేడిని అందిస్తాయి.

హాట్ చాక్లెట్

మీరు నిజంగా చాక్లెట్ ప్రేమికులే అయితే శీతాకాలం ఖచ్చితంగా మీకు ఇష్టమైన సీజన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శీతాకాలంలో సాయంత్రం వేళ వేడి వేడి కోకో లేదా హాట్ చాక్లెట్‌ని సిప్ చేస్తూ ఉంటే ఆ మజానే వేరు. దీనికి కాస్త దాల్చిన చెక్కను జోడించడం ద్వారా హాట్ చాక్లెట్‌ను మరింత ప్రత్యేకంగా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.