టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
  • టీఎస్​పీఎస్సీ ఉద్యోగులను విచారిస్తున్న అధికారులు  
  • మొత్తం 10 మంది ఉద్యోగులకు గ్రూప్ 1లో వందకు పైగా మార్కులు 
  • ఇప్పటికే ముగ్గురి అరెస్టు.. వీరిలో షమీమ్​కు 127, రమేశ్​కు 122 మార్కులు

హైదరాబాద్‌‌, వెలుగు:టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. గ్రూప్‌‌1లో 100కుపైగా మార్కులు సాధించిన టీఎస్‌‌ పీఎస్సీ ఉద్యోగులను ప్రశ్నిస్తోంది. మొత్తం 26 మంది ఎంప్లాయీస్ గ్రూప్ 1 పరీక్ష రాయగా, వారిలో 10 మందికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించింది. వీరిలో ముగ్గురిని బుధవారం అరెస్టు చేయగా, గురువారం మరో ఏడుగురిని అదుపులోకి తీసుకుంది. బుధవారం అదుపులోకి తీసుకున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌‌‌‌ షమీమ్‌‌, ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగి రమేశ్, మాజీ ఉద్యోగి సురేశ్​ను గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది.

కోర్టు 14 రోజుల రిమాండ్‌‌ విధించగా చంచల్ గూడ జైలుకు తరలించింది. ఎల్బీనగర్‌‌‌‌ గుంటి జంగయ్య కాలనీ రామ్‌‌ అవెన్యూలోని షమీమ్‌‌ ఇంట్లో సోదాలు జరిపింది. ఈ కేసులో నిందితులైన ప్రవీణ్‌‌, రాజశేఖర్‌‌ ‌‌రెడ్డి, రేణుక సహా 9 మంది కస్టడీ గురువారంతో ముగిసింది. దీంతో వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి చంచల్‌‌గూడ జైలుకు తరలించారు. తాజాగా షమీమ్, రమేశ్, సురేశ్​ల అరెస్టుతో నిందితుల సంఖ్య 12కు చేరింది. శుక్రవారం మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.  

షమీమ్​కు 2013లో ఉద్యోగం 

2013లో గ్రూప్‌‌---–2 ద్వారా షమీమ్‌‌ ఉద్యోగం పొందినట్లు సిట్‌‌ అధికారులు గుర్తించారు. ఇప్పుడు రాజశేఖర్‌‌‌‌, ప్రవీణ్‌‌ ద్వారా పేపర్‌‌‌‌ లీక్ కావడంతో గ్రూప్‌‌–1 రాసినట్లు ఆధారాలు సేకరించారు. ప్రిలిమ్స్ లో షమీమ్ 127 మార్కులు,  డేటా ఆపరేటర్‌‌‌‌గా పని చేస్తున్న ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగి‌‌ రమేశ్ 122 మార్కులు సాధించినట్లు.. వీరితో పాటు టీఎస్ పీఎస్సీలో పని చేసిన మాజీ ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగి సురేశ్ కు కూడా 100కు పైగా మార్కులు వచ్చినట్టు గుర్తించారు. ఇప్పటికే ఈ ముగ్గురిని అరెస్టు చేయగా, వాళ్లను కస్టడీకి కోరుతూ శుక్రవారం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా122 మంది అభ్యర్థులు గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు సాధించినట్టు సిట్‌‌ అధికారులు గుర్తించారు. వాళ్లందరికీ పేపర్ లీకేజీతో సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.