ఫామ్హౌస్‌‌‌‌‌‌‌‌ లో డ్రగ్స్ కేసుపై సిట్

ఫామ్హౌస్‌‌‌‌‌‌‌‌ లో డ్రగ్స్ కేసుపై సిట్
  • సీపీ సుధీర్​బాబు పర్యవేక్షణలో 9 మందితో ఏర్పాటు
  • సిట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌గా చేవెళ్ల డీసీపీ యోగేశ్​ గౌతమ్
  • 3 నెలల్లో చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని డీజీపీ ఉత్తర్వులు
  • శంషాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో 8 మంది నిందితుల విచారణ
  • రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, రితేశ్​ రెడ్డి, నమిత్‌‌‌‌‌‌‌‌ శర్మను కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్‌‌‌‌‌‌‌‌
  • రితేశ్​ రెడ్డి గన్‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ రద్దుకు చర్యలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఫామ్​హౌస్‌‌‌‌‌‌‌‌లో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ పార్టీ, కాల్పుల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్​ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు పర్యవేక్షణలో చేవెళ్ల డీసీపీ యోగేశ్​ గౌతమ్ చీఫ్‌‌‌‌‌‌‌‌గా మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఫామ్​హౌస్‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ పార్టీలు, అంతర్రాష్ట్ర గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్లపై సమగ్ర దర్యాప్తు చేసి.. 3 నెలల్లోగా చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని ఆదేశించారు.  ఈ నేపథ్యంలో బుధవారం నుంచి సిట్ దర్యాప్తు ప్రారంభించనుంది.

రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌‌‌‌‌‌‌‌, రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తమ్ముడు రితేష్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్టర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌నమిత్‌‌‌‌‌‌‌‌ శర్మ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలు రిమాండ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, నమిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, రితేష్ రెడ్డితో పాటు ఎంపీ పుట్టా మహేశ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ మినహా మిగిలిన 8 మంది నిందితులను మంగళవారం శంషాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో విచారించారు. కౌశిక్‌‌‌‌‌‌‌‌ రవి ఎంత మొత్తంలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ తెచ్చాడు, పార్టీలో ఎంత వినియోగించారని ప్రశ్నించినట్లు తెలిసింది.

ప్రధానంగా నమిత్‌‌‌‌‌‌‌‌ శర్మకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. డ్రగ్స్ పాజిటివ్‌‌‌‌‌‌‌‌ వచ్చిన వారిలో ముగ్గురు జైలులో ఉండగా, కౌశిక్ రవి, పబ్ నిర్వాహకుడు అర్జున్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని 45 రోజుల పాటు డీఅడిక్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ మహేశ్ యాదవ్ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 4న విచారణకు హాజరవుతానని పోలీసులకు తెలిపారు.

రోహిత్ రెడ్డి, నమిత్‌‌‌‌‌‌‌‌ శర్మ దందాలపైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌..
నమిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి వ్యాపారాలపై సిట్‌‌‌‌‌‌‌‌ ఫోకస్ పెట్టనుంది. నమిత్‌‌‌‌‌‌‌‌ శర్మ ఏ వ్యాపారాలు చేస్తారు, రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో కలిసి చేస్తున్న దందాలేంటి అన్న సమాచారం సేకరించనున్నారు. కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై, వీకెండ్ పార్టీలకు హాజరయ్యే హై ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ వ్యక్తులు, రోహిత్ రెడ్డి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌పై సిట్‌‌‌‌‌‌‌‌ దర్యాప్తు చేయనుంది. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను చేధించేందుకు నిందితుల కాల్‌‌‌‌‌‌‌‌ డేటాతో పాటు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తారు.

ఇదే ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే కొనుగోలుపై సిట్‌‌‌‌‌‌‌‌..
మొయినాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఇదే ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం సిట్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసింది. అప్పటి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘సిట్’సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌‌‌‌‌లు, ఆడియో రికార్డుల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్ కేసులో సిట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఇదే..
సిట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌: యోగేష్ గౌతమ్, ఐపీఎస్,డీసీపీ, చేవెళ్ల
‌‌ఎం.రవీందర్ రెడ్డి, గ్రూప్ కమాండర్, గ్రేహౌండ్స్
సీహెచ్.శిరీష, డీసీపీ, షాద్‌‌‌‌‌‌‌‌నగర్
ఎన్‌‌‌‌‌‌‌‌. బుచ్చయ్య , డీఎస్పీ, ఈగల్ ఫోర్స్
సి.హరీశ్ చంద్రా రెడ్డి, డీఎస్పీ, ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్
వై.మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఓ,మోయినాబాద్  పోలీస్ స్టేషన్
సి.కోటేశ్వర రావు, ఎస్‌‌‌‌‌‌‌‌ఐ, మోకిలా
ఎన్‌‌‌‌‌‌‌‌.వెంకన్న, ఎస్‌‌‌‌‌‌‌‌ఐ, మొయినాబాద్ పీఎస్‌‌‌‌‌‌‌‌ 
సదాత్ అలీ, ఎస్‌‌‌‌‌‌‌‌ఐ, శంషాబాద్ రూరల్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌

నిందితుల కస్టడీకి కోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌..
సిట్‌‌‌‌‌‌‌‌ బృందానికి ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌బాబు దిశానిర్దేశం చేశారు. ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో కాల్పులు జరిపిన రితేష్‌‌‌‌‌‌‌‌ రెడ్డి గన్ లైసైన్స్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, రోహిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మొయినాబాద్ పోలీసులు ఉప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి కోర్టులో పిటిషన్ వేశారు.