దానం నాగేందర్​ పాచిక పారేనా?

దానం  నాగేందర్​ పాచిక పారేనా?
  • ఖైరతాబాద్​లో గులాబీ నేతల సహాయ నిరాకరణ
  • ఎమ్మెల్యే అందుబాటులో ఉండరంటూ వినిపిస్తున్న వాదనలు
  • నియోజకవర్గంలో బీఆర్ఎస్​పై పెరుగుతున్న వ్యతిరేకత
  • కాంగ్రెస్​కు అనుకూలంగా మారుతున్న ఓటర్లు
  •  రెండు వర్గాలుగా విడిపోయిన పీజేఆర్ అనుచరులు

హైదరాబాద్, వెలుగు:  ఖైరతాబాద్​ నుంచి మరోసారి గెలిచేందుకు సిట్టింగ్​అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, తన విజయానికి వేస్తున్న ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయోననే దానిపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోపక్క కాంగ్రెస్​అభ్యర్థి విజయారెడ్డి కూడా బీఆర్ఎస్​కు దీటుగా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్​ తమకు అనుకూలమని భావించే మైనారిటీ, దళితుల ఓట్లను సాధించడానికి విజయారెడ్డి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

ఇక సెగ్మెంట్​లోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ​కంటే ప్రచారంలో కాంగ్రెస్ ​ముందుండడం గులాబీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా పీజేఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పడిన మురికివాడలు, ఫిల్మ్​నగర్​లోని​18 బస్తీలు, ఎంఎస్​ మక్తా, బీఎస్​మక్తా, ఎంబీటీ నగర్​వంటి ప్రాంతాల్లో  కాంగ్రెస్​హవా కొనసాగుతోంది. సిట్టింగ్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​పై సెగ్మెంట్​లో ఏర్పడిన వ్యతిరేకతను హస్తం పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది. ముఖ్యంగా దానం వ్యక్తిగత వ్యవహార శైలి తెలిసిన వారంతా ఆయన గెలుపుపై పలు  వాదనలు చేస్తున్నారు.  

పార్టీ కార్యకర్తలకు చిక్కడు దొరకడుగా మారినట్లు చెబుతున్నారు. దానంను కలిసేందుకు వెళ్తే.. పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఆయనను కలిసేందుకు వెళ్లేవారు ఎమ్మెల్యే లను కలవాలంటే చాలా కష్టంగా ఉంటుందని అంటున్నారు.  2018 ఎన్నికల్లో సిట్టింగ్​ ఎమ్మెల్యే చింతల  రామచంద్రారెడ్డిపై అనూహ్యంగా విజయం సాధించిన దానం నాగేందర్​తర్వాత దాదాపు  మూడేళ్ల పాటు నియోజక వర్గ ప్రజలకు కనిపించలేదనేది ప్రచారంలో ఉంది. 

కొంతకాలం ఆయన అనారోగ్యం కారణంగా ప్రజలకు దూరంగా ఉంటున్నారని చెప్పుకున్నారు.  రెండేళ్లుగా బీఆర్ఎస్​ కార్యక్రమాల్లో ముఖ్యంగా సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్ ​పాల్గొనే వాటిలోనే ఆయన ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో  మరోసారి ఆయన అభ్యర్థిత్వం ఖరారు కావడంతో రెండోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. 

పీజేఆర్ క్యాడర్ ఎవరి వైపు?

ఖైరతాబాద్​ నుంచి గతంలో పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దన్​రెడ్డి క్యాడర్​ ఇప్పుడు ఎవరికి మద్దతుగా నిలుస్తుందన్నది హాట్ టాపిక్​గా మారింది. పీజేఆర్​హయాంలో ఆయన వెంట తిరిగిన పలువురు ముఖ్య నేతలు ఇప్పుడు రెండువర్గాలుగా విడిపోయి ఉన్నారు. ఇందులో కొందరు దానం నాగేందర్​కు మద్దతుగా బీఆర్ఎస్​లో కొనసాగుతున్నారు. 

మరికొందరు పీజేఆర్ కూతురు ప్రస్తుత కాంగ్రెస్​ అభ్యర్థి విజయారెడ్డికి మద్దతుగా నిలిచారు. ఖైరతాబాద్​లో ఇప్పటికీ పీజేఆర్ చరిష్మా కొనసాగుతుందని  ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. మాజీ కార్పొరేటర్ ​కృష్ణయాదవ్​, మహేందర్, చందు, డా.అశోక్ తదితరులు దానం వెంట కొనసాగుతుం డగా, మాజీ కార్పొరేటర్​మహేశ్​యాదవ్​, ఇంకొందరు ముఖ్యనేతలు విజయారెడ్డికి సపోర్టుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. 

బీఆర్ఎస్ ​ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి కాంగ్రెస్​కు అనుకూలంగా మారుతుందన్న వాదన ఉంది. అందుకే సెగ్మెంట్​లో  పలువురు కాంగ్రెస్ ​వాదులు విజయారెడ్డికి అనుకూలంగా క్యాంపెయిన్​లో పాల్గొంటున్నారు. పీజేఆర్ కూతురి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్​కు పెరుగుతున్న ఆదరణతో తన గెలుపు ఖాయమని కాంగ్రెస్​అభ్యర్థి విజయా రెడ్డి ధీమాతో ఉన్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బంజారాహిల్స్​, హిమాయత్​నగర్, పంజాగుట్ట, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో పాదయాత్రలు, సభలతో కాంగ్రెస్ దూసుకుపోతుంది. 

కొత్త జాబితా ఓటర్ల జాబితా ప్రకారం సెగ్మెంట్​లో 2,89,558 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1,50,892 మంది, మహిళలు 1,38,639 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో దాదాపు 27 వేల కొత్త ఓటర్లు ఈసారి ఓటు హక్కును పొందారు. ఇందులో అధికశాతం యువత ఉండడం కాంగ్రెస్​కు లాభిస్తుందని భావిస్తున్నారు.