ఎల్ బీ నగర్ ప్రేమోన్మాదికి రిమాండ్

ఎల్ బీ నగర్ ప్రేమోన్మాదికి రిమాండ్
  • సీసీ కెమెరాల ఫుటేజ్ లు సేకరణ
  • రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలింపు

ఎల్​బీనగర్: యువతిపై దాడి చేసి అడ్డొచ్చిన ఆమె తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడు శివకుమార్ ను  సోమవారం రాత్రి ఎల్​బీనగర్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  రామాంతాపూర్ లో ఉండే శివకుమార్ కొంతకాలంగా బాధిత యువతిని పెండ్లి చేసుకోవాలని ఇబ్బందులకు గురి చేస్తుండగా ఆమె తిరస్కరిస్తూ వస్తుంది. గత 20 రోజుల నుంచి అతడిని ఆమె దూరంగా పెట్టింది. దీంతో శివకుమార్ ఆదివారం ఉదయం తనకు దూరపు బంధువు అక్క వరుసయ్యే మహిళతో  పెండ్లి విషయం యువతితో మాట్లాడించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం శివకుమార్ ఎల్ బీనగర్ ఆర్టీసీ కాలనీలోని యువతి ఇంటికి వచ్చి గొడవపడుతుండగా ఆమె తమ్ముడు పృథ్వీతేజ్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 

దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా.. ఇంట్లోని కత్తితో పృథ్వీతేజ చాతీపై శివకుమార్ బలంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన పృథ్వీతేజ రక్తం కారుతుండగా చేత్తో అదిమిపట్టుకుని బయటకు వచ్చాడు. అప్పటికే బెడ్రూంలో యువతిపై శివకుమార్ దాడికి పాల్పడ్డారు. స్థానికులు, పక్కింటి వారు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి శివకుమార్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. నిందితుడిపై హత్య, హత్యాయత్నం,ట్రెస్ పాస్, వేధింపుల కేసుల నమోదు చేశారు.  దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారాలు సేకరించి నిందితుడిని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.