డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..! బాధిత కుటుంబసభ్యుల ఆందోళన

డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..! బాధిత కుటుంబసభ్యుల ఆందోళన

గండిపేట,వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యం, గడువు ముగిసిన మందుల కారణంగా ఆరు నెలల పసి బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. బండ్లగూడ జాగీర్​ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి తన ఆరు నెలల కుమారుడు అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం శనివారం స్థానిక క్రియాన్స్ హాస్పిటల్​కు తీసుకెళ్లాడు. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడిన కొద్దిసేపటికే బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు . 

దీంతో గడువు ముగిసిన మందులు ఇవ్వడం వల్లే బాలుడు చనిపోయాడని ఆగ్రహించిన బంధువులు హాస్పిటల్​పై దాడికి దిగారు. ఫర్నీచర్, కుర్చీలు, అద్దాలను ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.