- రెండు వారాలు ‘ఆపరేషన్ మ్యూల్ అకౌంట్స్’ సోదాలు
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు సరఫరా చేస్తున్న ఏజెంట్లు, ఖాతాదారులపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో 206 సైబర్ నేరాలు సహా దేశవ్యాప్తంగా నమోదైన 1,172 కేసులతో సంబంధం ఉన్న 101 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో 18 మంది మహిళలు ఉన్నారు.
ఆయా ఖాతాల ద్వారా రూ.17 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకుంది. ‘ఆపరేషన్ మ్యూల్ అకౌంట్స్’ సోదాల వివరాలను టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ బుధవారం ప్రకటించారు. తెలంగాణతోపాటు కేరళ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో రెండు వారాలు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు.
5 శాతం కమీషన్‌తో ఖాతాల సరఫరా
డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు సహా రాష్ట్రంలో నమోదైన సైబర్ నేరాల్లో గుర్తించిన బ్యాంక్ ఖాతాల ఆధారంగా ‘ఆపరేషన్ మ్యూల్ అకౌంట్స్’ చేపట్టారు. మ్యూల్ ఖాతాలు, కేవైసీ డాక్యుమెంట్ల ఆధారంగా సోదాలు చేసి, కమీషన్లకు ఖాతాలు సరఫరా చేస్తున్న ఏజెంట్లు, ఖాతాదారులను గుర్తించారు.
సైబర్ నేరగాళ్లు వినియోగించే ఖాతాల్లోని లావాదేవీల మొత్తంలో 5 శాతం వరకు ఖాతాదారులు, మధ్యవర్తులకు కమీషన్‌గా చెల్లిస్తున్నట్లు గుర్తించారు. ఆయా ఖాతాల లావాదేవీలు, ఏటీఎం విత్‌డ్రాలు, బల్క్ ట్రాన్స్‌ఫర్లు, విదేశీ లావాదేవీలను పరిశీలించారు.
కేరళలో 35 మంది అరెస్ట్
ఏడు సైబర్పోలీస్స్టేషన్లలో నమోదైన 51 కేసులకు సంబంధించి టీజీసీఎస్‌బీ అధికారులు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 5 వరకు కేరళ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిలో రెండు వారాలు సోదాలు నిర్వహించారు. అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,172, తెలంగాణలో 206 కేసులకు సంబంధించి 101 మందిని అరెస్ట్ చేశారు.
అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ముఠాల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వారిలో 19 మంది ఏజెంట్లు, 82 మంది మ్యూల్ ఖాతాదారులుగా గుర్తించారు. కేరళలో 35 మంది, ఏపీలో 22, కర్నాటకలో 17, తమిళనాడులో 14, తెలంగాణలో 12, పుదుచ్చేరిలో ఒకరిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో స్వయం ఉపాధి పొందుతున్న వారు 23 శాతం, ప్రైవేట్ ఉద్యోగులు 13 శాతం, గృహిణులు 10 శాతం, డ్రైవర్లు 7 శాతం, సేల్స్, మార్కెటింగ్ రంగానికి చెందిన వారు 5 శాతం ఉన్నారు.
