- రెండేళ్లలో నలుగురు ఎండీల మార్పు
- అభివృద్ధి ప్రాజెక్టులపై ఎఫెక్ట్
- ప్రమోషన్లకూ తప్పని ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పర్యాటక శాఖలో అధికారుల బదిలీలు ప్రహసనంగా మారాయి. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాల్సిన శాఖలో కుర్చీలాట నడుస్తోంది. ఒక అధికారి వచ్చి శాఖపై పట్టు సాధించేలోపే.. మరో అధికారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. 27 నెలల్లో ఏకంగా ఆరుగురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మారడం గమనార్హం. సెక్రటరీలే కాదు.. క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సిన మేనేజింగ్ డైరెక్టర్ల పరిస్థితీ అంతే.. రెండేళ్లలో నలుగురు ఎండీలు మారడంతో పర్యాటక ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయి. నిరంతరం అధికారుల మార్పుతో పర్యాటక శాఖలో నిర్ణయాలు తీసుకోవడంలోనూ జాప్యం జరుగుతుందనే ప్రచారం సాగుతోంది.
దీంతో అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. అంతేకాదు, టూరిజం ప్రమోషన్లలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. పర్యాటక శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. టూరిజం సర్క్యూట్లు, ఏకో టూరిజం, పలు పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్యాకేజీలను రెడీ చేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వం వచ్చిన 27 నెలల్లోనే ఆరుగురు టూరిజం శాఖ స్పెషల్ సెక్రటరీలు మారడం విశేషం.
అంటే ఒక్కొక్కరు నాలుగైదు నెలలకు మించి పనిచేసింది లేదు. అయితే, ఒక ఆఫీసర్ కేటాయించిన శాఖపై పట్టు సాధించాలంటే కనీసం నెల నుంచి రెండు నెలలు పడుతుంది. సిబ్బంది, వారి పనితీరు తెలుసుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. ఆ సమయంలోనే మళ్లీ శాఖ మార్పు జరుగుతుండటంతో అభివృద్ధి పనులపై ఎఫెక్ట్ పడుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శులుగా శైలజా రామయ్యర్, ఆ తర్వాత వాణి ప్రసాద్, ఎన్.శ్రీధర్, స్మితా సబర్వాల్, జయేష్ రంజన్, ఇటీవల మళ్లీ వాణి ప్రసాద్ బాధ్యతలు చేపట్టడం విశేషం.
ఎండీల పరిస్థితి అదే..
పర్యాటక అభివృద్ధి సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన మేనేజింగ్ డైరెక్టర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. రెండేళ్ల కాలంలో నలుగురు ఎండీలు మారడం విశేషం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం డిపార్ట్మెంట్కు మేనేజింగ్ డైరెక్టర్లు నలుగురు బాధ్యతలు నిర్వర్తించారు. టూరిజం ఎండీగా రమేశ్ నాయుడు, ప్రకాశ్ రెడ్డి, వల్లూరు క్రాంతి, ఇటీవల గౌతమి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
తరచూ ఆఫీసర్లు మారుతుండటంతో అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాటిపై పర్యవేక్షణ కొరవడటం.. వచ్చిన అధికారులు కూడా తాము ఎన్ని నెలలు కొనసాగుతారో తెలియక పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని తెలుస్తోంది. ఫలితంగా హరిత హోటళ్లు, బోటింగ్ యూనిట్ల నిర్వహణ, ఇతర టూరిజం ప్రాజెక్టులు, ప్రమోషన్ వర్క్స్ మందగమనంలో ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలొస్తున్నాయి.
కొత్త పాలసీలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, కేంద్రం నుంచి వచ్చే స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకం నిధుల వినియోగంలో స్పష్టత కరువవుతోందనే వాదనలూ ఉన్నాయి. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం తదితర ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ.15,279 కోట్ల పెట్టుబడులతోపాటు 50 వేల మంది ఉపాధికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. మొత్తం 30 ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,279 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఈ పెట్టుబడులతో 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించే చాన్స్ ఉంది.
ఈ పెట్టుబడులతో 10,000 కొత్త హోటల్ గదులు, థీమ్ పార్కులు, ఫిలిం టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ అభివృద్ధితోపాటు తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించినా.. ఆఫీసర్ల మార్పు అనేది టూరిజం శాఖకు మైనస్ అని పర్యాటక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక ఆఫీసర్ ఆమోదించిన ఫైళ్లను, తదుపరి వచ్చే అధికారి మళ్లీ మొదటి నుంచి సమీక్షించాల్సి రావడంతో సమయం వృథా అవుతోందంటున్నారు. కనీసం రెండేళ్లపాటు ఒకే అధికారిని కొనసాగిస్తే తప్ప టూరిజం శాఖ గాడినపడే అవకాశం లేదని చెప్తున్నారు.
