- ప్రమాదం తర్వాత ఇప్పటికీ మొదలవని పనులు
- ఔట్లెట్ వద్ద కూడా టీబీఎంతో పనులు చేయించలేని పరిస్థితి
- అక్కడ 350 మీటర్ల ఎత్తులో నల్లవాగు క్రాసింగ్
- టీబీఎంతో పనులు చేపడితే ప్రమాదం జరిగే ఆస్కారం
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇన్లెట్ మాత్రమే కాకుండా.. ఔట్లెట్ నుంచి కూడా ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇన్లెట్ వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పనులు మొదలు పెట్టారు. అయితే, దురదృష్టవశాత్తూ అదే నెల 22న టన్నెల్ పైకప్పు కూలిపోయింది.
8 మంది కార్మికులు అందులోనే చనిపోయారు. ఓ ఇద్దరు కార్మికుల మృతదేహాలను బయటకు తీసుకురాగలిగారు. మిగతా ఆరుగురు మృతదేహాలు అందులోనే ఉండిపోయాయి. అయితే, తాజాగా ప్రభుత్వం ఆ దుర్ఘటన నుంచి తేరుకుని మళ్లీ పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. షియర్ జోన్లను తెలుసుకునేందుకు నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)తో సర్వే చేయించింది.
భూమి పరిస్థితులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకునేందు హెలికాప్టర్ సర్వే చేశారు. ఆ సర్వేలో భాగంగానే ఇన్లెట్ వద్దనే కాకుండా.. ఔట్లెట్ వద్ద కూడా షియర్జోన్లున్నాయని గుర్తించినట్టు తెలిసింది. ఔట్లెట్ వద్ద నుంచి ప్రస్తుతం 21 కిలో మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో టన్నెల్ కొండపైన నల్లవాగు క్రాసింగ్ ఉన్నట్టు తేల్చారు. టన్నెల్ నుంచి 350 మీటర్ల ఎత్తులో వెళ్తున్నట్టుగా గుర్తించినట్టు తెలిసింది.
నిర్మాణ సంస్థ కొర్రీలు
ఎస్ఎల్బీసీ పనులకు 2005లోనే జేపీ సంస్థతో ఒప్పందం కుదిరినా.. 20 ఏండ్లుగా ఆ సంస్థ పనులను సాగదీస్తూ వస్తున్నది. ఎప్పుడూ ఏదో ఒక కొర్రీ పెడుతూనే ఉన్నది. కరెంట్ బిల్లులు పెండింగ్ అని ఒకసారి.. టీబీఎం పాడైందని ఇంకోసారి.. విడిభాగాలు రాలేదని మరోసారి.. ఇలా ఏదో ఒక సాకు చెప్తూ పనులను ఆలస్యం చేసింది. పైసలు మాత్రం కావాల్సినప్పుడు తీసుకున్నది.
అసలు పైసలు రిలీజ్ చేస్తేగానీ పనులు చేపట్టని సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ సంస్థ కొర్రీలు పెడుతున్నది. ఇప్పటికే ఆ సంస్థ దివాళా ప్రక్రియ మొదలవ్వగా.. బిల్లులు చెల్లిస్తేనే పనులను మొదలుపెడతామని మొండికేసింది. అయితే, ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎస్క్రో అకౌంట్‌ను తెరవాలని నిర్ణయించింది. నిధులను ఆ అకౌంట్‌కు బదిలీచేసి.. అందులో 30 % పట్టుకుని మరో 70 % నిధులను నిర్మాణ సంస్థకు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని నిర్ణయించింది. కానీ, నిర్మాణ సంస్థ అందుకు అంగీకరించలేదట. ఎస్క్రో అకౌంట్‌కు ఒప్పుకునేది లేదని, నిధుల ఫ్లోకు ఇబ్బంది అవుతుందని వాదిస్తున్నది.
పాత పెండింగ్ బకాయిలను పాత అకౌంట్‌కు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది. ఇరిగేషన్ శాఖ, ప్రాజెక్ట్ అధికారులు మాత్రం ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ అని నిర్మాణ సంస్థకు తేల్చిచెప్పినట్టు తెలిసింది. కాగా, 43.93 మీటర్ల పొడవైన టన్నెల్లో ఇప్పటివరకు అవుట్లెట్ వద్ద నుంచి 21 కిలో మీటర్లు, ఇన్లెట్ వద్ద నుంచి 14 కిలో మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.
టీబీఎంతో ముప్పే..
శ్రీశైలం ఆఫ్‌షోర్ ప్రాంతమైన ఇన్లెట్ వద్ద నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) ద్వారా పనులు చేపట్టడంతో ముందు ఏముందో తెలుసుకునే చాన్స్ లేకుండా పోయింది. ఫలితంగా అది కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఔట్లెట్ వద్ద కూడా టీబీఎంతో పనులు చేయిస్తే మళ్లీ అదే ప్రమాదం జరుగుతుందన్న భయాలు అధికారులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ కూడా టీబీఎంతో కాకుండా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేస్తేనే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దానికితోడు.. ఔట్లెట్ వద్ద టీబీఎంలోని విడిభాగాలను ఇన్లెట్ వద్ద ఉన్న టీబీఎంకు బిగించారని తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ టీబీఎం పనికిరాకుండా పోయింది. దీంతో ఔట్లెట్ వద్ద టీబీఎంతో పనిచేసే పరిస్థితులు లేకుండా పోయాయి. ఆ విడిభాగాలు మళ్లీ ఎప్పుడు వచ్చేది కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కాకుండా పనులు త్వరగా పూర్తవ్వాలంటే.. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో ముందుకుపోవడమే మంచిదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
