- ఏడాది తర్వాత మళ్లీ మొదలైన పనులు
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులు ఎట్టకేలకు మళ్లీ మొదలయ్యాయి. ఏడాది గ్యాప్ తర్వాత మంగళవారం అధికారులు టన్నెల్ పనులను ప్రారంభించారు. నిరుడు ఫిబ్రవరిలో టన్నెల్ కూలి 8 మంది సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. తర్వాత పనులను పునరుద్ధరించేందుకు టన్నెల్ ఎక్స్ పర్టులను ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించింది. ఎన్జీఆర్ఐతో పరీక్షలూ చేయించింది.
టన్నెల్ బోరింగ్ మెషీన్ తో కాకుండా.. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు బ్లాస్టింగ్ ను టన్నెల్ అధికారులు చేపట్టారు. అవుట్ లెట్ 20.435 కిలోమీటర్ పాయింట్ వద్ద.. 3.50 మీటర్ల మేర బ్లాస్టింగ్ ను విజయవంతంగా చేపట్టారు. ఇకపై అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ రోజూ నిర్విరామంగా టన్నెల్ బ్లాస్టింగ్ పనులు చేపడతామని అధికారులు చెప్తున్నారు.
