V6 News

ఎస్ఎల్బీసీ పనుల్లో సిబ్బంది భద్రతే ముఖ్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్ఎల్బీసీ పనుల్లో సిబ్బంది భద్రతే ముఖ్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •     నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ 
  •     టన్నెల్ పై స్టడీ రిపోర్టును అందజేసిన ఎన్జీఆర్ఐ 
  •     కాళేశ్వరం బ్యారేజీల సాయిల్​టెస్టులకూ సహకరించాలని కోరిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో సిబ్బంది భద్రతే ముఖ్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. టన్నెల్ కు సంబంధించి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) సమగ్ర అధ్యయనం చేసింది. ఆ రిపోర్టును సంస్థ చీఫ్ సైంటిస్ట్ హెచ్​వీఎస్.సత్యనారాయణ శుక్రవారం మంత్రికి అందజేశారు. 

ఈ సందర్భంగా ఎన్జీఆర్ఐ పనితనాన్ని ఆయన అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సాయిల్ టెస్టులకూ సహకారం అందించాలని కోరారు. కాగా, ఎస్ఎల్బీసీ టన్నెల్​పై ఎన్జీఆర్ఐ ఇచ్చిన నివేదికను సమగ్రంగా విశ్లేషించాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన పరికరాలు, యంత్ర సామగ్రిని వీలైనంత త్వరగా తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు. 

151 మీటర్ల మేర తవ్వకం పూర్తి.. 

ఎస్​ఎల్బీసీ సొరంగం తవ్వకం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఇప్పటివరకు 151.50 మీటర్ల మేర టన్నెల్ తవ్వకం పూర్తయింది. ఎలక్ట్రిక్​లోడర్స్, హెవీ డంపర్లను తీసుకొచ్చారు. త్వరలో మిగతా యంత్రాలు వచ్చేస్తే.. నెలకు 200 మీటర్ల చొప్పున రెండు వైపులా తవ్వడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. 

ఇక టన్నెల్ లో ఎక్కడైనా ప్రమాదం పొంచి ఉన్నా.. ఎవరికీ ఎలాంటి ముప్పు లేకుండా ఫోర్ పూలింగ్ మెథడ్ లో టన్నెల్ బ్లాస్టింగ్ పనులను చేపడుతున్నట్లు చెప్తున్నారు. కాగా, మాగ్నెటో మీటర్ ద్వారా భూమి పొరల్లో సమస్యలను తెలుసుకునేందుకు హెలిబోర్న్ సర్వే చేసింది. సిస్మిక్ ఇమేజింగ్, ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ టెక్నిక్స్​ఆధారంగా భూమి పరిస్థితులను గుర్తించింది. స్ట్రెస్ జోన్స్, సీపేజ్, టన్నెల్ రూఫ్ స్థిరత్వం వంటి వాటిని విశ్లేషించింది.