పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పీజీ రోడ్‌లోని పార్సీ ధర్మశాల గేటు సమీపంలో జరిగిన హత్య కలకలం రేపింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కన్నా అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పూల వ్యాపారి మహ్మద్ తాజ్, పాత సామాన్ల దుకాణదారుడు నవీన్ కుమార్‌కు.. పాత పేపర్లు ఏరుకునే కన్నా, సిరాజ్ తో పరిచయం ఉంది.
ప్రతి రోజూ రాత్రి కన్నా, సిరాజ్ పార్సీ ధర్మశాల గేటు వద్దే ఫుట్‌పాత్‌పై పడుకునేవారు. శుక్రవారం ఉదయం తాజ్ తన దుకాణానికి వచ్చి కన్నాను లేపగా, అతడు రక్తపు మడుగులో శవమై కనిపించాడు. రాంగోపాల్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. అర్ధ రాత్రి దాటిన తర్వాత కన్నాను తలపై కొట్టి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పూల వ్యాపారి తాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంగోపాల్‌పేట్ సీఐ బి.సురేశ్ కుమార్ తెలిపారు.
