
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గత ఏడాది నుంచి రెపోరేట్లను 225 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఇచ్చే వడ్డీని తగ్గించాయి. ఫలితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీలు)పై వచ్చే వడ్డీ పడిపోయింది. ఎఫ్‌డీల ద్వారా వచ్చే నెలవారీ ఆదాయంపై ఆధారపడే సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయిస్ ఇబ్బందిపడుతున్నారు. క్రమంగా వడ్డీ తగ్గుతూ రావడంతో వారి అవసరాలు తీరడం కష్టంగా మారుతోంది. అయితే కొన్ని చిన్న బ్యాంకులు ఇప్పటికీ ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీలను ఇస్తున్నాయి. వీటిలో ఎక్కువగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులే ఉన్నాయి. సాధారణ బ్యాంకులతో పోలిస్తే ఇవి నాలుగు శాతం వరకు ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి.
అన్నీ పరిశీలించాకే ఇన్వెస్ట్ చేయాలి…
బ్యాంకుల పనితీరు, దాని దగ్గర ఉన్న ఫండ్స్, అధిక వడ్డీ ఇవ్వడానికి పెట్టే కండిషన్ల వంటి వివరాలన్నింటినీ పరిశీలించాకే డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. డబ్బు ఎక్కువగా ఉంటే, ఒకే బ్యాంకుకు బదులు ఎక్కువ బ్యాంకుల్లో, వివిధ టెన్యూర్లలో ఇన్వెస్ట్ చేయడం తెలివైన పని. ఎఫ్‌డీలు మెచ్యూర్ కాగానే తిరిగి ఇన్వెస్ట్ చేస్తే సంపద పెరుగుతూనే ఉంటుంది. ఎక్కువ ఎఫ్‌డీలు ఉంటే, అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. వాటిపైనే లోన్ తీసుకునే సదుపాయం ఎలాగూ ఉంటుంది. మధ్యలోనే ఎఫ్‌డీని క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం రాదు. అయితే ఎఫ్‌డీలపై వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటే ట్యాక్స్‌లు పడొచ్చు.