బతుకమ్మ చీరలు టైంకి ఇవ్వకపోతే బ్లాక్‌లిస్ట్‌లోకి..

బతుకమ్మ చీరలు టైంకి ఇవ్వకపోతే బ్లాక్‌లిస్ట్‌లోకి..
  • ఆర్డర్లు పూర్తి చేయకుంటే బ్లాక్​లిస్ట్​లో పెడ్తరట!
  • టెస్కో నిర్ణయంతో ఆందోళనలో సిరిసిల్ల నేతన్నలు
  • బడా వ్యాపారులకు మేలు చేయాలనే కుటర్గా అనుమానం
  • కరోనా ఎఫెక్ట్ తో ముందుకు సాగని వస్త్రోత్పత్తి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నేతన్నలపై కరోనా ఎఫెక్ట్​పడింది. ఓ వైపు కార్మికులు కరోనా బారిన పడుతుంటే మరోవైపు సాంచాలు అప్​గ్రేడ్​కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గడువులోగా బతుకమ్మ చీరల ఆర్డర్లు పూర్తి చేయకపోతే చిన్న తరహా పరిశ్రమలన్నీ బ్లాక్​ లిస్ట్​లో పెడతాం.. ఆర్డర్లు రద్దు చేస్తామంటూ చేనేత జౌళిశాఖ అధికారులు సిరిసిల్ల నేతన్నలతో సంతకాలు చేయించుకోవడంపై కార్మికవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సిరిసిల్ల నేత కార్మికుల పొట్ట కొట్టి బడా, టెక్స్​టైల్​పార్క్​వ్యాపారులకు ఆర్డర్లు ఇచ్చే కుట్ర చేస్తున్నారని,  ఇందుకోసం టెస్కోలో ఓ కీలక అధికారి ప్రయత్నాలు చేస్తున్నారని నేత కార్మికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇస్తోంది. ఈసారి కూడా రూ.320 కోట్ల ఆర్డర్​ఇచ్చారు. 132 మ్యాక్​ సంఘాలు,170 ఎస్​ఎస్​ఐ సంఘాల ఆధ్వర్యంలో 14 వేల సాంచాలపై చీరలను తయారు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కార్మికులు రాత్రిబంవళ్లు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్నారు. లాక్​డౌన్​కారణంగా పనిముట్లు లేక, టెక్నిషియన్లు రాకపోవడంతో సాంచాల అప్​గ్రేడేషన్​ నిలిచిపోయింది. 14 వేల సాంచాలకు 7 వేలు మాత్రమే అప్​గ్రేడ్​ అయ్యాయి. దీంతో బతుకమ్మ చీరల తయారీ ఆలస్యం కానుంది. మరోవైపు టెస్కో ఎస్ఎస్ఐ, మ్యాక్స్​సంఘాలు ప్రభుత్వ రూల్స్​ప్రకారం సెప్టెంబర్​15లోగా ఆర్డర్లు పూర్తి చేసి ఇవ్వాలని అంగీకార పత్రాలపై సంతకాలు చేయించుకుంటోంది. పూర్తి చేయకుంటే సంఘాలను బ్లాక్​ లిస్టులో పెడతామని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై పవర్​ లూం, మ్యాక్స్​ సంఘాల అధ్యక్షులు చిమ్మని ప్రకాశ్, ప్రతినిధి బీమని రామచంద్రం నిరసన వ్యక్తం చేశారు. టెక్స్​టైల్​పార్క్​వ్యాపారులతో పాటు సిరిసిల్ల బడా వ్యాపారులకు ఆర్డర్లు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని, ఇందుకు ఓ కీలక అధికారి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కార్మికుల పొట్ట కొట్టవద్దని సర్కారుకు విన్నవించారు. 

భయాందోళనకు గురి చేస్తున్నరు
సంఘాలను భయందోళనకు గురి చేస్తున్నారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. టెక్స్​టైల్​పార్క్​కు ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారు. కరోనా కష్టకాలంలో ఇలా చేయడం సరికాదు. మంత్రి కేటీఆర్​ కల్పించుకొని కార్మికులను న్యాయం చేయాలి. మేం ఒప్పంద పత్రాలు రాసివ్వం. 
– చిమ్మని ప్రకాశ్, పవర్​లూం, మ్యాక్​ సంఘాల ​అధ్యక్షుడు

ముందు జాగ్రత్తగా అంగీకార పత్రాలు
ఆర్డర్లు సెప్టెంబర్​ 15లోగా పూర్తి చేయాలి. బతుకమ్మ చీరలు అన్ని జిల్లాలకు పంపిణీ చేయాల్సి ఉం టుంది. అందుకే ఒక్కో సంఘం ఎంత ఉత్పత్తి చేస్తుంది.. దాని వివరాల కోసం అంగీకార పత్రాలు అడుగుతున్నం. ఎంత వస్త్రం ఉత్పత్తి అవుతుందో చూశాక మిగతా ఆర్డర్​ ఎలా పూర్తి చేయాలనే దానిపై అధికారు లు నిర్ణయిస్తారు. సర్కార్​ పేర్కొన్న గడువులోగా ఆర్డర్లు పూర్తి చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఈ అంగీకార పత్రాలు తీసుకుంటున్నం. ఇతరులకు ఆర్డర్లు ఇచ్చే ఆలోచన మాకు లేదు.
– అశోక్​రావ్, డిప్యూటీ డైరెక్టర్, టెస్కో, రాజన్నసిరిసిల్ల