చైనా వస్తువులతో మన దేశంలోని చిన్న కంపెనీలు నాశనం

చైనా వస్తువులతో మన దేశంలోని చిన్న కంపెనీలు నాశనం
  •     హింస, ద్వేషానికి కారణం అన్యాయమే: రాహుల్
  •     ఉత్తరప్రదేశ్‌‌లోని అలీగఢ్ చేరుకున్న న్యాయ్ యాత్ర

లక్నో: చైనా వస్తువుల దిగుమతితో మన దేశంలోని చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు నాశనమయ్యాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనా- ఉత్పత్తులు దేశంలోని పెద్ద వ్యాపార సంస్థలకు వరంగా మారాయని విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ గాంధీ శనివారం ఉత్తరప్రదేశ్‌‌లోని అలీగఢ్ చేరుకున్నారు. అక్కడ వారిద్దరికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఇండియా కూటమి మిత్రపక్షమైన సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) మద్దతుదారులు గ్రాండ్ వెల్ కం చెప్పారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అలీగఢ్ లోని ప్రసిద్ధ తాళాల పరిశ్రమలు, స్థానిక కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. తక్కువ ధర గల చైనా- ఉత్పత్తుల దిగుమతి స్థానిక చిన్న, కుటీర యూనిట్లకు మరణ మృదంగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల పెద్ద పెద్ద వ్యాపార సంస్థల పంట పండుతున్నదని ఆరోపించారు. తాను మళ్లీ అలీగఢ్ వచ్చినప్పుడు చైనా వస్తువులు కనిపించొద్దని..అంతటా 'మేడ్ ఇన్ అలీగఢ్' ఎలక్ట్రానిక్ వస్తువులే కనిపించాలని కోరారు.

 అన్యాయం వల్లే ద్వేషం పెరుగుతున్నది

బీజేపీ పాలన వల్ల దేశంలో  ద్వేషం, హింస పెరిగిపోయాయని రాహుల్ మండిపడ్డారు. " దేశంలో  హింస, ద్వేషానికి కారణం అన్యాయం. పేదలు, రైతులు, యువకులు, మహిళలకు చాలా అన్యాయం జరుగుతున్నది. అందుకే మేం రెండో భారత్ జోడో యాత్ర పేరుకు 'న్యాయ్' అనే పదాన్ని చేర్చాం. ఈ యాత్ర దేశాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తోంది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతోంది" అని రాహుల్ వివరించారు. ఉత్తరప్రదేశ్‌‌లో పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ కావడం బాధకారమని, లక్షలాది నిరుద్యోగుల జీవితం ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.

అందరూ ఏకమవ్వాలి

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ..'దేశంలో  అన్యాయం రాజ్యమేలుతున్నది. అందుకే నిరుద్యోగం అతిపెద్ద సంక్షోభంగా మారింది. ప్రభుత్వ కంపెనీలను పారిశ్రామికవేత్తలకు అమ్మేశారు. దేశంలో లక్షలాది ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా రిక్రూట్‌‌మెంట్‌‌ నిర్వహించడం లేదు. ఒకవేళ రిక్రూట్‌‌మెంట్‌‌ ఇచ్చినా పేపర్‌‌ లీక్‌‌ అవుతుంది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలి’ అని ప్రియాంక పిలుపునిచ్చారు. కాగా.. ఆగ్రా మీదుగా సాగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు.