ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్మార్ట్​ ప్రచారం.. మెసేజ్‍లు..  వీడియోలు.. అమ్మాయిలతో ఫోన్‍ కాల్స్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్మార్ట్​ ప్రచారం.. మెసేజ్‍లు..  వీడియోలు.. అమ్మాయిలతో ఫోన్‍ కాల్స్
  • సోషల్‌ మీడియాలో పోస్టులు, వెబ్‌సైట్‌లలో యాడ్‌లు
  • స్మార్ట్​ తెరలపై హోరెత్తుతున్న ప్రచారం
  • మూడు ఉమ్మడి జిల్లాల్లో తిరగలేక సోషల్ మీడియా వైపు 
  • ‘పచ్చీస్‍ ప్రభారి’ ఫార్ములాతో ఓటర్ల వద్దకు బీజేపీ
  • ఉద్యోగుల ఓట్లడగడానికి భయపడుతున్న టీఆర్‌ఎస్‌ లీడర్లు

వరంగల్‍ రూరల్‍, వెలుగు: మెసేజ్‍లు.. వాట్సాప్‍ వీడియోలు.. చివరికి కాల్‍ సెంటర్‍ తరహాలో అమ్మాయిలతో ఫోన్‍కాల్స్.. ఎమ్మెల్సీ ఎలక్షన్‍ క్యాంపెయినింగ్‌‌లో క్యాండిడేట్లు ఏ అవకాశాన్నీ వదలట్లేదు. నియోజకవర్గ పరిధిలో పర్సనల్‍ అండ్‍ పార్టీ మీటింగ్‌‌లకు అటెండ్‍ అవుతూనే ఈ తరహా ప్రచారంతో స్మార్ట్​ఫోన్ల తెరలపై సందడి చేస్తున్నారు. ఇందుకోసం రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. మెజార్టీ ఓట్లు కావాలంటే క్యాండిడేట్‌‌ గురించి ఓటర్లకు బాగా తెలియాల్సి ఉండటం, ప్రచారం టైమ్‌‌ కూడా 10 రోజులే ఉండటంతో గ్రాడ్యుయేట్ల కన్నుల్లో పడేందుకు అభ్యర్థులంతా ఎవరి స్టైల్‌‌లో వాళ్లు సోషల్‍ మీడియా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వెబ్‌‌సైట్‌‌లలో యాడ్స్‌‌ ఇస్తున్నారు.

గ్రాడ్యుయేట్ ఓటుందంటే చాలు! రోజూ తక్కువలో తక్కువ 3, 4 ఫోన్లు.. ఆరేడు మెసేజ్‌లు వస్తున్నాయి. మధ్యమధ్యలో ఎమ్మెల్సీ అభ్యర్థి మాట్లాడే స్పెషల్‍ వీడియోలు వస్తున్నాయి. ఇందుకోసం కొన్ని పొలిటికల్ పార్టీలు ప్రత్యేకంగా సోషల్‍ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంటే..ఇంకొందరు ప్రైవేట్‍ అడ్వర్టయిజర్లకు అప్పగించారు. ఆయా టీమ్‌‌లు గ్రాడ్యుయేట్‍ ఓటర్‍ లిస్ట్‌‌ను సంపాదించి పేరుతో సహా మెసేజ్‌‌ పంపిస్తున్నారు. పోటీలో ఉన్న
ఫలానా అభ్యర్థికి ఓటేయాలని క్యాండిడేట్‍, పార్టీ పేరు, అడ్రస్‍ సహా అన్నీ పంపుతున్నారు. ఓటర్‍ లిస్టులో గ్రాడ్యుయేట్‍ సీరియల్‍ నంబర్‍, పోలింగ్‍
స్టేషన్‍ బూత్‍ నంబర్‍ యాడ్‌‌ చేస్తున్నారు. నమస్కారం.. అంటూ కాల్‍ సెంటర్ల నుంచి అమ్మాయిలతో కాల్స్‌‌ వస్తున్నాయి. ఇంకొందరు ఓటర్లందరికీ
పోస్టల్‍ ద్వారా లెటర్స్ పంపి ఓట్లడుగుతున్నారు .

ఇంటింటికీ తిరగలేక..
ఎమ్మెల్యే , ఎంపీ, లోకల్‍ ఎలక్షన్లతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చాలా టఫ్‍గా ఉంటుంది. ఉమ్మడి మూడు జిల్లాలు కవర్‍ చేయాలంటే అభ్యర్థులకు చుక్కలు కనపడుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్‍, నల్గొండ, ఖమ్మం చూస్తే.. ప్రస్తుతం 11 జిల్లాలయ్యా యి. తక్కువలో తక్కువ 120
నుంచి 150 మండలాలంటున్నాయి. 30 వరకు ఎమ్మెల్యే నియోజకవర్గాలు.. ఆరేడు ఎంపీ స్థానాలున్నాయి. కాలేజీలైతే వందల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఆఫీసులు, ఇన్‌‌స్టిట్యూషన్లు తిరగాలి. ఉదయం మార్నింగ్‍ వాక్‍లతో మొదలవుతున్న ప్రచారం రాత్రి ఎవరో ఒక టీంతో డిన్నర్‍ వరకు కంటిన్యూ అవుతోంది. ఒక జిల్లాలో తిరిగితే మరో జిల్లా ఓటర్లకు దూరం అవుతున్నారు. ఓ క్యాలెండర్‍ ప్రిపేర్‍ చేసి దానికి అనుగుణంగా గ్రాడ్యుయేట్‍ ఓటర్లను
ఆకర్షిస్తున్నారు. పార్టీ బలం లేని తీన్మార్‍ మల్లన్న ఇప్పటికే 1,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మూడు జిల్లాలను కవర్‍ చేసే ప్రయత్నం చేశారు.

కుల, వృత్తుల సంఘాలతో మీటింగ్‌
గంపగుత్త ఓట్లు పడేలా క్యాండి డేట్లు ప్లాన్‌ చేసుకుంటున్నారు . స్టూడెంట్‌ యూనియన్ల మీటింగ్‌‌లు పెడుతున్నారు. లాయర్ల సంఘాలను కలుస్తున్నరు. టీచర్ల యూనియన్లతో మాట్లాడుతున్నరు . కుల, వృత్తులు సంఘాలు మంతనాలు జరుపుతున్నరు. ఇక తాము దగ్గరుండి ఓటు హక్కు ఇప్పించిన వాళ్లపై మరింత ఫోకస్‌ పెడుతున్నరు. ఈ మధ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ క్యాండిడేట్‌ ఏర్పాటు చేసిన మీటింగ్‌‌లో 200 కిలోల మటన్, 300 కిలోల చికెన్‌‌తో వంట చేయించి లంచ్ పెట్టించారు.

ఉద్యోగులు, నిరుద్యోగుల జోలికెళ్లని టీఆర్‌‌ఎస్‌‌

ఉద్యోగులు, నిరుద్యోగులు, పెన్షనర్ల ఓట్లను అడిగేందుకు టీఆర్ఎస్ లీడర్లు భయపడుతున్నారు. వారితో మీటింగ్ పెట్టేందుకు జంకుతున్నారు. పీఆర్సీ, రిటైర్మెంట్ ఏజ్ పెంపు, ప్రమోషన్లు, ట్రాన్స్‌‌ఫర్లు అమలు చేయకపోవడంతో ఉద్యోగులు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. పీఆర్సీ అమలు చేస్తే పెన్షన్ పెరిగేదని ఎదురు చూసిన పెన్షనర్లకూ నిరాశే ఎదురైంది. ఉద్యోగ రిక్రూట్‌‌మెంట్ చేపట్టడం లేదని, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఓట్లు అడిగితే గొడవలు జరగొచ్చని, ఆ వర్గాలను కదిలించొద్దని పార్టీ పెద్దలు సూచించినట్టు చర్చ జరుగుతోంది.

బీజేపీ..‘పచ్చీస్‍ ప్రభారి’
ఇక బీజేపీ మిగతా పార్టీల మాదిరి సభలు, సమావేశాలు, సోషల్‍ మీడియా ప్రచారం చేస్తూనే.. ‘పచ్చీస్‍ ప్రభారి’ ఫార్ములాతో ముందుకు వెళుతోంది. పార్టీకి తోడుగా బలమైన యువమోర్చా ఉండటంతో వారి సేవలను వాడుకుంటోంది. మూడు జిల్లాల పరిధిలో ఇన్‌ చార్జి టీమ్‌‌ లీడర్లను నియమించింది. వేలల్లో ఉండే వీరిలో ఒక్కొక్కరు 25 మంది గ్రాడ్యుయేట్‍ ఓటర్లతో ఇంటరాక్ట్ ​అవుతున్నారు.