
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్, వరంగల్ స్మార్ట్ సిటీ పనుల కోసం ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఎంపీ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఆరోపించారు. తాను ఒత్తిడి తేవడంతో ఇటీవల ఈ నిధులు ఇచ్చినా మ్యాచింగ్ గ్రాంట్మాత్రం ఇవ్వలేదన్నారు. సిటీలను స్మార్ట్గామార్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో స్కీమ్ నీరుగారిపోతోందన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి హరదీప్ సింగ్ పూరి తో ఆయన గురువారం భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల స్మార్ట్ సిటీ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని మంత్రికి వివరించారు. స్మార్ట్ సిటీ స్కీమ్ కింద కరీంనగర్, వరంగల్ లకు ఒక్కో దానికి రూ. 196 కోట్ల చొప్పున కేంద్రం ఫండ్స్ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌లో తాను నిధుల దారి మళ్లించడంపై నిలదీయగా రాష్ట్ర అధికారులు నీళ్లు నమిలారని చెప్పారు. ఇటీవల ఆ నిధుల్ని విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను మాత్రం రిలీజ్ చేయలేదన్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లేదని, ప్లానింగ్ లేకుండానే పనులు చేస్తున్నారని చెప్పారు.