జీవితాల్లోకి తొంగిచూస్తున్న స్మార్ట్ డివైజ్​లు

జీవితాల్లోకి తొంగిచూస్తున్న స్మార్ట్ డివైజ్​లు
  • తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజరే!

న్యూఢిల్లీ: మీకు తెలుసా?.. మనల్ని రోజూ... 24 గంటలపాటూ... ఎలక్ట్రానిక్​ కళ్లు కనిపెడుతున్నాయని! మన ప్రతి అడుగునూ గమనిస్తున్నాయని. మనం ఏం తింటున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎప్పుడు వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో... తెలుసుకుంటున్నాయని. ఇలా కనిపెట్టిన  ఆ సమాచారాన్ని వేరేచోటికి  చేరవేస్తున్నాయని.... మనకు సంబంధించిన  అన్ని విషయాలూ ఇంటర్నెట్ డివైజ్​లకు తెలిసిపోతున్నాయి. మనుషుల ప్రైవసీ పెద్ద డేంజర్​లో పడుతోంది. టీవీ, ఫ్రిజ్​, కారు, ఆఫీసు.. ఇవన్నీ మన జీవితాన్ని గమనిస్తున్నాయి. మన గురించి మొత్తం తెలుసుకుంటూ ఇంటర్నెట్​ ద్వారా​ సమాచారం పంపిస్తున్నాయి. 

మనం వాడే అన్ని ఎలక్ట్రానిక్​ వస్తువులు నెట్​తో కనెక్ట్ కావడం వల్ల జీవితం సులువు అయిన మాట నిజమే అయినా ప్రైవసీ మాత్రం ఎగిరిపోయింది. యాప్స్​ అన్నీ మనపై నిఘా వేస్తున్నాయి. ఎలక్ట్రానిక్​ వస్తువులు, కార్లు..ఆఖరికి ఇండ్లు కూడా జీవితాల్లోకి తొంగిచూస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ డివైజ్​లలో కొన్ని నెట్ లేకున్నా డేటాను కలెక్ట్​ చేస్తాయి. ఆఫీసులు, మాల్స్​, సిటీలు కూడా స్మార్ట్ అయిపోయాయి. అన్నింటిలోకి స్మార్ట్​ డివైజ్​లు చొచ్చుకుపోయాయ్​. ట్రాన్స్​పోర్ట్​, రవాణా, వ్యవసాయం, ఇండస్ట్రీల్లోకి ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​ (ఐఓటీ) ఎప్పుడో వచ్చేశాయ్​. 2018 నాటికి 2,200 కోట్ల ఐఓటీ డివైజ్​లు వాడకంలో ఉండగా, 2030 నాటికి వీటి సంఖ్య ఐదు వేల కోట్లకు చేరుతుందని అంచనా. 

అన్ని డివైజ్​లూ గూఢచారులే... 
స్మార్ట్​ ఫోన్లు, కెమెరాలు, వాయిస్​ అసిస్టెంట్లు వాటి లెన్సులు, మైక్రోఫోన్ల ద్వారా వీడియోలు తీస్తాయి. శబ్దాలను రికార్డు చేస్తాయి. ఫలితంగా మనం ఉన్నచోటు, మనం మాట్లాడే మాటలు వేరే వాళ్లకు తెలిసిపోతాయి. స్మార్ట్​టీవీలు కూడా గూఢచారుల్లా పనిచేస్తాయి. స్మార్ట్​బల్బులు మన నిద్రను, గుండెలయను రికార్డు చేస్తాయి. స్మార్ట్​వాక్యూమ్​ క్లీనర్లు ఇంట్లోని వస్తువులను గుర్తించి మ్యాపింగ్​ చేస్తాయి. కొన్ని వైఫై రూటర్లు యూజర్​అడుగుజాడలను గుర్తించి ఇతర స్మార్ట్​ డివైజ్​లతో షేర్ చేసుకుంటాయి. ‘స్మార్ట్​ డివైజ్​లు డేటాను కలెక్ట్​ చేస్తాయి కానీ మనుషులకు ఇవ్వవు’ అని కంపెనీలు చెప్పే మాటలు నిజం కాకపోవచ్చు. ఉదాహరణకు అమెజాన్​ వర్కర్లు అలెక్సా ద్వారా జరిగే సంభాషణలను వింటారు. ఆ సమాచారాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటర్నెట్​ ద్వారా షేర్​ అయ్యే డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. ప్రైవసీ కోసం మన ఇంట్లోని స్మార్ట్​ డివైజ్​లను ఆఫ్​ చేయొచ్చు కానీ ఆఫీసుల్లోని, మాల్స్​లోని డివైజ్​లు మనల్ని గమనిస్తూనే ఉంటాయి. అందుకే స్మార్ట్​ డివైజ్ లను కొనేముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

అవగాహన పెంచుకోవాలె..
స్మార్ట్​ హోం పర్సనల్ అసిస్టెంట్లు ఏయే డేటాను తీసుకుంటాయి.. వాటిని ఎక్కడ స్టోర్​ చేస్తాయి.. దానిని ఎవరు తీసుకుంటారు.. ఇట్లాంటి విషయాలపై యూజర్లకు అవగాహన ఉండటం లేదు.​ కొన్ని దేశాల్లో స్మార్ట్​ డివైజ్​లు నిఘా వేయకుండా కఠిన చట్టాలు ఉన్నాయి. కంపెనీలు కూడా వీటిని పాటించాల్సి ఉంటుంది. డేటాను థర్డ్​ పార్టీలకు ఇవ్వకూడదు. స్మార్ట్​ డివైజ్ సక్రమంగా పనిచేయాలంటే దాని ఫర్మ్​వేర్​ను ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేయడం తప్పనిసరి. దాని సెటింగ్స్​ను జాగ్రత్తగా గమనించాలి. డేటా కలెక్షన్​ ఆప్షన్​ను డిజబుల్​ చేయాలి. ‘ది ఆన్​లైన్​ ట్రస్ట్​ అలయన్స్​’ వంటివి, డివైజ్​లు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నెట్​ ద్వారా టిప్స్​ ఇస్తున్నాయి. ఆ వివరాలను తెలుసుకోవాలి. స్మార్ట్​ డివైజ్​ను కొనేముందే అది ఏ రకమైన డేటాను తీసుకుంటుందో తెలుసుకోవాలి. కంపెనీ డేటా మేనేజ్​మెంట్ పాలసీని చదవాలి. దీని ఆధారంగా స్మార్ట్​ డివైజ్ వెర్షన్​ను ఎంచుకోవాలి.