దేశంలో ‘స్మార్ట్’ లాక్​ డౌన్?

దేశంలో ‘స్మార్ట్’ లాక్​ డౌన్?
  • రెడ్, ఆరెంజ్, గ్రీన్​ జోన్లుగా ఇండియా విభజన
  • కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహం
  • వైరస్​ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాలు రెడ్​ జోన్​లో..
  • కాస్త తక్కువ ప్రభావం ఉన్నవి ఆరెంజ్, గ్రీన్​ జోన్​లో..
  • గ్రీన్​ జోన్​లో చిన్న పరిశ్రమలకూ అనుమతి ఇచ్చే చాన్స్

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. నమోదైన కేసుల ఆధారంగా, వాటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్​ జోన్లుగా డివైడ్​ చేయాలని కేంద్రం భావిస్తోంది. మరో రెండు వారాల పాటు లాక్​ డౌన్​ను పొడిగించాలని భావిస్తున్నందున అందుకు తగ్గట్టుగా ఈ జోన్లను వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్​ లాక్​ డౌన్​ అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, జిల్లాల్లో లాక్​డౌన్​ను కొనసాగిస్తారని, వైరస్​ ప్రభావం అంతగా లేని జిల్లాలు, ప్రాంతాల్లో పాక్షిక మినహాయింపులు ఇస్తారని తెలిపాయి. ఆర్థిక పరమైన సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొన్ని సెక్టార్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్నాయి. శనివారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన ప్రధాని మోడీ.. ఈ సందర్భంగా లాక్​ డౌన్​ పొడిగించేందుకే మొగ్గు చూపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఎకనామిక్​ యాక్టివిటీని పెంచేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

లాక్​ డౌన్​పై ఏం చేద్దాం?
లాక్​ డౌన్​ కు సంబంధించి నిర్ణయం తీసుకోవడం అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారింది. ప్రజల ఆరోగ్యం, కరోనా కేసులను కట్టడి చేయాలంటే లాక్​డౌన్​ను కొనసాగించడమే మేలని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో కంపెనీలు, బిజినెస్​లు మూతపడి.. ఎకనామిక్​ యాక్టివిటీ పడిపోవడంతో అందరికీ ఆదాయం తగ్గిపోయింది. మరోవైపు జాబ్స్​ పోతాయన్న భయం కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎకానమీని గాడిలో పెట్టాలంఏట లాక్​డౌన్​కు కొన్ని మినహాయింపులు ఇవ్వాలనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు జోన్​ వైస్​గా లాక్​ డౌన్​ అమలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. అటు లాక్​ డౌన్​ కొనసాగిస్తూనే.. మరోవైపు ఎకనామిక్​యాక్టివిటీని కూడా అనుమతించవచ్చని భావిస్తున్నారు.

రెడ్​ జోన్:
రెడ్​ జోన్లలో పూర్తిగా లాక్​ డౌన్​ ప్రకటిస్తారు. ఈ జోన్లలో ఎలాంటి యాక్టివిటీనీ అనుమతించరు. ఎవరూ అందులోకి ఎంటర్​ కావడానికిగానీ, ఎగ్జిట్​ కావడానికి గానీ కుదరదు. ఎక్కువ సంఖ్యలో కేసులు ఉన్న హాట్​ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలు ఈ జోన్​ కిందికి వస్తాయి.

ఆరెంజ్​ జోన్:
తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను ఆరెంజ్​ జోన్లుగా పరిగణిస్తారు. వీటిలో తక్కువగా పబ్లిక్​ ట్రాన్స్​ పోర్ట్​కు అనుమతిస్తారు. వ్యవసాయ సంబంధ పనులకు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.

గ్రీన్​ జోన్:
అసలు కేసులు నమోదవ్వని ప్రాంతాలను గ్రీన్​ జోన్​గా చూస్తారు. ఆరెంజ్​ జోన్​ కంటే కాస్త ఎక్కవగా ఆంక్షలను సడలిస్తారు. కొన్ని చిన్న తరహా పరిశ్రమలను కూడా తెలిచేందుకు ఓకే చెబుతారు. అయితే సోషల్ డిస్టెన్స్​ ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.