పండగల తర్వాత పండగ మళ్లీ వచ్చింది. రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున.. బ్యాంకుల్లో డబ్బులు జమ అవుతున్నాయి. రైతు భరోసా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో పడుతుండటంతో.. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లు.. రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు జమ చేస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
ఎకరానికి ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. యాసంగి సీజన్ కు సంబంధించి ఎకరానికి 6 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.తొలి విడతగా 68 లక్షల 89 వేల 955 మంది రైతులకు సంబంధించి 57 లక్షల 44 వేల 907 ఎకరాలకు 3 వేల 446 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మూడు విడతల్లో అర్హులైన రైతులు అందరికీ క్రమంగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి.
2026, మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడుతూ ఉన్నాయి. ఈ మేరకు రైతులు తమ ఖాతాల్లో పడిన రైతు భరోసా డబ్బులను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్ వెంకన్న (అలియాస్ టిఆర్ఎస్ వెంకన్న) అనే రైతుకు 18 గుంటల్లో పట్టా భూమికి రూ.2700 జమ అయ్యాయని స్క్రీన్ షాట్ ను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశాడు.
నిర్మల్ జిల్లాలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఎకరానికి ఆరువేల జమ అయ్యాయని రైతులు చెబుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను సీఎంనిలబేట్టున్నారంటున్నారని ప్రశంసిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన పులి సతీష్ కుమార్ అనే రైతుకు ఎకరం 6 గుంటల భూమికి 6000/- రూపాయలు రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయని స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
