హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు.. కానీ ఏటీసీల్లో చదువుకుంటే ఉద్యోగం కల్పించే బాధ్యత నాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతి నెల 2 వేల రూపాయల చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వబోతున్నామని తెలిపారు. విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడాలని.. ట్యాలెంట్ ఉంటే ప్రపంచం మనముందు తలవంచుకుని నిలబడుతుందన్నారు. ఆదివారం (మార్చి 22) సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు.
తర్వాత జిల్లాలో 775 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో బటన్ నొక్కి రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
►ALSO READ | ఆర్య వైశ్యుల్లో గాంధీ పుట్టడం దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి
‘‘రాష్ట్రంలో అత్యుత్తమ శిక్షణ పొందిన టీచర్లు లక్షకు పైగా పనిచేస్తున్నారు. 18 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నాం. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రారంభించడమే కాకుండా విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రైవేటుకన్నా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి టీచర్లు ఉన్నారు. ప్రైవేటు మోజులో పడొద్దు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి’’ అని కోరారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , రఘునందన్ రావుతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
