నోటి దుర్వాసన..అసలు కారణాలు ఇవే..కేవలం బ్రష్ చేస్తే సరిపోదు!

నోటి దుర్వాసన..అసలు కారణాలు ఇవే..కేవలం బ్రష్ చేస్తే సరిపోదు!

సాధారణంగా నోటి దుర్వాసనను వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన సమస్యగా చూస్తాం. బాగా బ్రష్ చేయడం, మౌత్ వాష్ వాడటం లేదా మింట్ బిళ్లలు వేసుకోవడం ద్వారా దీనిని తగ్గించవచ్చని అందరూ భావిస్తారు. కానీ ఈ సమస్య పరిశుభ్రత ఒక్కటే కారణం కాదు.. చాలా కారణాలున్నాయంటున్నారు డాక్టర్లు.  

నోటి దుర్వాసన వ్యక్తిగత ప్రవర్తన కంటే ఎక్కువగా జీవక్రియకు సంబంధించిన సమస్య. ఇది కేవలం ఒక పూట బ్రష్ చేయడం మర్చిపోవడం వల్ల వచ్చేది కాదు, నోటిలోని సూక్ష్మజీవుల స్థాయిలో జరిగే మార్పుల వల్ల వస్తుందంటున్నారు డాక్టర్ దేబోజ్యోతి ధర్. ఈమె మన దేశంలో మొట్టమొదటి మైక్రోబయోమ్ ఆధారిత ఆరోగ్య అంచనా సంస్థ బగ్ స్పీక్స్ కో-ఫౌండర్, డైరెక్టర్.  

నోటి దుర్వాసనకు అసలు కారణం ఏంటి?

డాక్టర్ దేబోజ్యోతి ధర్ ప్రకారం.. ప్రపంచ జనాభాలో సుమారు 25 నుంచి 50 శాతం మంది హాలిటోసిస్ అంటే నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. నోటి శుభ్రత లేకపోవడం ఒక కారణం చెబుతున్నప్పటికీ అదే పూర్తి కారణం కాదంటున్నారు. నోటి దుర్వాసనకు అసలు కారణం నోటిలోని మైక్రోబయోమ్ అసమతుల్యత. మన నోటిలో సహజంగా ఉండే బ్యాక్టీరియా సమూహంలో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, హానికర బ్యాక్టీరియా పెరిగి ఈ సమస్య మొదలవుతుంది.

బ్యాక్టీరియా పాత్ర

మన నోటిలో వందలాది జాతుల బ్యాక్టీరియా ఉంటుంది.  నోటిలో 500 నుంచి 700 రకాల బ్యాక్టీరియా ఉంటుందని  డాక్టర్ ధర్ చెబుతున్నారు. వీటిలో కొన్ని బ్యాక్టీరియా వొలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్‌ను విడుదల చేస్తాయి. నోటి నుంచి వచ్చే అసహ్యకరమైన వాసనకు ఇవే ప్రధాన కారణం.

కేవలం బ్రష్ చేయడం ఎందుకు సరిపోదు?

బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం వంటివి పైపై మెరుగులకు మాత్రమే పనికొస్తాయి.  సుమారు 80 నుంచి 90 శాతం నోటి దుర్వాసన కేసులు నోటి లోపలే పుడతాయి. ఇవి కేవలం పరిశుభ్రత వల్ల కాకుండా, సూక్ష్మజీవుల అసమతుల్యత (Dysbiosis) వల్ల వస్తాయి అంటే బయట అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, లోపల బ్యాక్టీరియా అసమతుల్యంగా ఉంటే వాసన తగ్గదంటున్నారు డాక్టర్లు. 

నోరు దాటిన సమస్య

ప్రతి కేసూ నోటిలోనే మొదలవ్వదు.  సుమారు 10 నుంచి20 శాతం కేసులు జీర్ణకోశ సమస్యలు ,ఇతర శారీరక రుగ్మతలతో ముడిపడి ఉంటాయి. మన జీర్ణక్రియలో జరిగే మార్పులు కూడా నోటి దుర్వాసనపై ప్రభావం చూపుతాయి.

పరిష్కార మార్గంలో మార్పు..

ఒకప్పుడు నోటి దుర్వాసనను కేవలం మౌత్ వాష్‌లు ,మింట్స్ వాడి తాత్కాలికంగా కవర్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆలోచన మారుతోంది.  ఇప్పుడు ఫోకస్ కేవలం వాసనను కప్పిపుచ్చడం మీద కాదు, నోటిలోని మైక్రోబయోమ్ సమతుల్యతను తిరిగి సాధించడం మీద ఉందంటున్నారు.  అంటే కేవలం లక్షణాన్ని కాకుండా, మూల కారణాన్ని సరిదిద్దడమే శాశ్వత పరిష్కారమని డాక్టర్లు చెబుతున్నారు.