నిషేదిత జాబితాలోకి లక్ష ఇండ్లు..అమ్మలేక.. కొనలేక సామాన్యుల అవస్థలు

నిషేదిత జాబితాలోకి లక్ష ఇండ్లు..అమ్మలేక.. కొనలేక సామాన్యుల అవస్థలు
  • నాన్ అగ్రికల్చర్ ఆస్తులను బ్లాక్ లిస్ట్ చేర్చిన రెవెన్యూ అధికారులు
  •  ప్రొహిబిటెడ్ లిస్ట్ '22 ఏ'లోకి 18 లక్షల ఇండ్ల నెంబర్లు, 9 లక్షల జాగలు
  • ప్రతి గ్రామంలో యావరేజ్​గా 150 నుంచి 200 ఇండ్ల దాకా ఈ లిస్ట్​లోకే 
  • తాతలు, ముత్తాతలు కట్టుకున్న ఇండ్లకూ ఎసరు 
  • రెండు నెలల క్రితం వరకు రిజిస్ర్టేషన్లు.. ఇప్పుడు నిషేధిత జాబితా అంటూ రిజెక్ట్ 
  • అమ్మలేక.. కొనలేక సామాన్యుల అవస్థలు  
  • దళారీల ద్వారా వెళ్తున్న బడాబాబులకు మాత్రం లైన్ క్లియర్ 

హైదరాబాద్, వెలుగు:  గ్రామాల్లో సొంత ఇల్లు లేదా స్థలం ఉంటే అవసరాల కోసం అమ్ముకుందామంటే ఇప్పుడు అమ్మలేరు.. కొత్తగా ఇండ్లు, జాగలు కొనుగోలు చేద్దామన్నా కొనలేరు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఇండ్లు, ఇండ్ల జాగాలు అకారణంగా నిషేధిత ఆస్తుల జాబితాలోకి వెళ్లాయి. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో నిషేధిత జాబితా సిద్ధం చేసిన రెవెన్యూ యంత్రాంగం నాన్ అగ్రికల్చర్ ఆస్తుల కిందకు వచ్చే ఇండ్లు, ఇండ్ల జాగాలను సైతం గుడ్డిగా 22ఏ జాబితాలోకి చేర్చింది. ఈ  నిర్ణయంతో ప్రతి గ్రామంలో యావరేజ్​గా 200 ఇండ్ల నుంచి 300 ఇండ్ల దాకా ప్రొహిబిటెడ్ లిస్ట్​లోకి వెళ్లిపోయాయి. ఎన్నో ఏండ్ల కింద తాతలు, ముత్తాతలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇండ్లనూ ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ తరానికి చెందిన ఆస్తి అయినా సరే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రెడ్ మార్కు చూపిస్తూ లావాదేవీలకు బ్రేక్ వేస్తున్నారు.  కలెక్టరేట్లలో జరిగే ప్రతి 'ప్రజావాణి'లో వస్తున్న ఫిర్యాదుల్లో సగానికి పైగా ఈ నిషేధిత ఆస్తుల గురించే కావడం చూస్తేనే ఈ సమస్య ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో నివాసాలను బ్లాక్ లిస్టులో పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. ఏళ్లుగా గ్రామ కంఠాలుగా, నివాస ప్రాంతాలుగా ఉన్న స్థలాలను సైతం గంపగుత్తగా ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో నమోదు చేశారు. కిందిస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ఆఫీసుల్లో కూర్చుని ఇష్టారాజ్యంగా మ్యాపింగ్ ప్రక్రియను మమ అనిపించారు. దీనివల్ల తరతరాలుగా నివాసం ఉంటున్న పక్కా ఇళ్లు కూడా రాత్రికి రాత్రే అసైన్డ్ లేదా సీలింగ్ భూముల పరిధిలోకి మారిపోయాయి. 


ఏళ్ల తరబడి పన్నులు కడుతూ, విద్యుత్ కనెక్షన్లు కలిగి ఉన్న ఆస్తులకు సైతం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. తమ తప్పును సరిదిద్దుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం, ఆ భారాన్ని మొత్తం సామాన్య ప్రజల నెత్తినే రుద్దుతూ చోద్యం చూస్తోంది. రోజువారీ పనులు మానుకుని తహసీల్దార్, కలెక్టరేట్ల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా కనీస పరిష్కారం మాత్రం లభించడం లేదు. అనాలోచితంగా తెచ్చిన ఈ విధానం సామాన్యుల పాలిట శాపంలా మారి, వారి సొంత ఆస్తిపైనే వారికి హక్కు లేకుండా చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అగ్రికల్చర్, నాన్​ అగ్రికల్చర్ కింద దాదాపు 90 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిసింది.  

లక్షలాది ఆస్తులు.. లక్షల ఎకరాలు బందీ 

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారుల అనాలోచిత మ్యాపింగ్ ప్రక్రియతో లక్షలాది నాన్ అగ్రికల్చర్ ఆస్తులు 22-ఏ (నిషేధిత) జాబితాలో బందీ అయ్యాయి. క్షేత్రస్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా కంప్యూటర్ల ముందు కూర్చుని చేసిన తప్పిదాలతో దాదాపు 18  లక్షల పక్కా ఇండ్లు, ఇంకో 9 లక్షల ఇండ్ల జాగలు క్రయవిక్రయాలకు నోచుకోకుండా ఆగిపోయాయి. విస్తీర్ణం పరంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3  లక్షల నుంచి 4 లక్షల ఎకరాల మేర నివాస యోగ్య స్థలాలు (గ్రామకంఠాలు, పాత లేఅవుట్లు) ఈ డెడ్ లాక్ లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తరతరాలుగా నివాసం ఉంటున్న పాత ఇండ్లను సైతం గుడ్డిగా అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, చెరువు శిఖం లేదా సీలింగ్ భూములుగా రికార్డుల్లోకి ఎక్కించేశారు. దీనివల్ల వేల కోట్ల రూపాయల స్థానిక రియల్ ఎస్టేట్ లావాదేవీలు కుదేలవ్వడమే కాకుండా, ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయానికి కూడా భారీ గండిపడుతోంది. ఈ నిషేధిత జాబితా ప్రభావం కేవలం వ్యక్తిగత కుటుంబాలపైనే కాకుండా స్థానిక రియల్ ఎస్టేట్ రంగంపైనా తీవ్రంగా పడింది. గ్రామాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో క్రయవిక్రయాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్లాట్లు చేసిన వెంచర్లు సైతం వివాదాల్లో చిక్కుకోవడంతో కొనుగోలు చేసిన బాధితులు బిల్డర్ల చుట్టూ తిరుగుతున్నారు. పారదర్శకత పేరుతో తెచ్చిన చట్టాలు చివరకు ఎవరూ ఏమీ చేయలేని ఒక డెడ్ లాక్ వాతావరణాన్ని సృష్టించడం గమనార్హం.  

ఊర్లకు ఊర్లే నిషేధిత జాబితాలోకి.. 

ఉమ్మడి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో దశాబ్దాల క్రితం వెలిసిన పక్కా కాలనీలను సైతం అర్బన్ ల్యాండ్ సీలింగ్, అసైన్డ్ భూముల జాబితాలో చేర్చడంతో ఇండ్ల యజమానులు బెంబేలెత్తుతున్నారు. ఇక నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి గ్రామీణ జిల్లాల్లో అయితే ఏకంగా ఊర్లకు ఊర్లే ప్రభుత్వ భూములుగా రికార్డులకెక్కి, ఒక్కో ఊరిలో 150  పైచిలుకు ఇండ్లు ప్రొహిబిషన్ లిస్టులో పడిపోయాయి. కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో దేవాదాయ, వక్ఫ్ బోర్డు భూముల ఓవర్ ల్యాపింగ్ పేరుతో వందలాది ఆస్తులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ప్రాణాపాయ స్థితిలో వైద్య ఖర్చుల కోసం ఇల్లు అమ్ముకుందామనుకున్న పేదలకు ఈ 22ఏ నిబంధన పెద్ద శాపంగా పరిణమించింది. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువుల కోసం ఆస్తిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వీలు కూడా ఈ జాబితాతో పూర్తిగా దెబ్బతింది. బ్యాంకులు ఈ నిషేధిత ఆస్తుల రికార్డును సాకుగా చూపిస్తూ సామాన్యులకు లోన్లు తిరస్కరిస్తున్నాయి. రెండు నెలల కిందట వరకు రిజిస్ర్టేషన్లు అయి.. సడన్​గా నిషేధిత జాబితా అంటుండంతో ఏం చేయాలో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు. అత్యవసర సమయాల్లో డబ్బులు పుట్టక దళారుల బారిన పడి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటూ కూలీలు ఆర్థికంగా చితికిపోతున్నారు. స్థలాలు కొనుక్కుని సొంతిల్లు నిర్మించుకుందామనుకున్న మధ్యతరగతి వర్గాల కలలు సైతం రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో కల్లలయ్యాయి. ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక, ప్రభుత్వ కార్యాలయాల మెట్లు ఎక్కుతూ బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది. 

పైసలిచ్చినోళ్లకు.. లైన్ క్లియర్

ఒకసారి 22ఏ జాబితాలో పడిన ఆస్తిని బయటకు తేవడం అంటే సామాన్యుడికి ప్రాణాలు తోడేయడం లాంటిదే అని స్పష్టమవుతోంది. ఈ ప్రక్రియను సరళీకృతం చేయాల్సిన ప్రభుత్వం దరఖాస్తులను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తూ తీవ్ర కాలయాపన చేస్తోంది. ఇదే అదునుగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల చుట్టూ దళారీ వ్యవస్థ పంజా విసురుతోంది. లిస్టు నుంచి పేరు తొలగించాలంటే ఆస్తి విలువలో సగం డబ్బులు లంచంగా సమర్పించుకోవాలని కిందిస్థాయి అధికారులు డిమాండ్ చేస్తున్నారు. పైసలు ఇచ్చుకున్న బడాబాబుల ఆస్తులు రాత్రికి రాత్రే నిషేధిత జాబితా నుంచి మాయమై రిజిస్ట్రేషన్లకు క్లియర్ అవుతున్నాయి. కానీ చేతిలో చిల్లిగవ్వ లేని పేదలు మాత్రం న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతూ న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. 

సగం ఇండ్లు '22 ఏ' లిస్టులోకే  

రెవెన్యూ అధికారుల నిర్వాకం వల్ల మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని ఓ గ్రామంలో ఒకరిద్దరిని కాదు, ఏకంగా సగం కుటుంబాలనే రోడ్డున పడేసింది. ఊరి మధ్యలో ఉన్న ఇండ్ల స్థలాల సర్వే నంబర్లను గంపగుత్తగా 'శిఖం' (చెరువు బఫర్ జోన్) భూములుగా నమోదు చేశారు. దీంతో ఆ గ్రామంలోని సుమారు 250 పక్కా ఇండ్లు నిషేధిత జాబితా(22 ఏ)లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆ ఊళ్లో ఎవరైనా పాత ఇల్లు పడగొట్టి కొత్తది కట్టుకుందామంటే పంచాయతీ పర్మిషన్ రావడం లేదు. ఆస్తి అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కూడా కావడం లేదు.    

లోన్ రాక.. బిడ్డ పెండ్లి ఆగింది  

కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన శ్రీనివాస్ ఓ చిరు వ్యాపారి. తన కూతురి పెళ్లి నిశ్చయం కావడంతో, పెళ్లి ఖర్చుల కోసం తాను ఉంటున్న ఇంటిని తాకట్టు పెట్టి రూ.10 లక్షలు లోన్ తీసుకుందామని బ్యాంకుకు వెళ్లాడు. పదిహేనేళ్ల క్రితం అన్ని లింక్ డాక్యుమెంట్లు సరిచూసుకుని కొనుక్కున్న ఆ ఇంటి పత్రాలను బ్యాంకు లాయర్ పరిశీలించాడు. ఆ ఆస్తి ఉన్న సర్వే నంబర్‌‌ను రెవెన్యూ అధికారులు పొరపాటున 'వక్ఫ్, ఎండోమెంట్' కింద 22ఏ జాబితాలో చేర్చారని చెప్పాడు. దీంతో ఆ ఇంటిపై ఎలాంటి లోన్ ఇవ్వలేమని బ్యాంకు మేనేజర్ స్పష్టం చేశాడు.