‘ధురంధర్ 2’ క్రేజ్: తెలుగులో టికెట్ల బుకింగ్.. బొమ్మ హిందీలో పడింది.. ఇంకేముంది గొడవ షురూ

‘ధురంధర్ 2’ క్రేజ్: తెలుగులో టికెట్ల బుకింగ్.. బొమ్మ హిందీలో పడింది.. ఇంకేముంది గొడవ షురూ

మార్చి 19న హిందీలో విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మార్చి 21న తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు డిమాండ్ పెరగడంతో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఓ మల్టిప్లెక్స్ థియేటర్‌లో గందరగోళం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.

హైదరాబాద్ పంజాగుట్టలోని PVR Next Galleria Mallలో ‘ధురంధర్ 2’ ప్రదర్శనలో, ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఒకే సమయానికి, ఒకే స్క్రీన్‌కు తెలుగు మరియు హిందీ వెర్షన్ల టిక్కెట్లు విక్రయించడంతో సమస్య తలెత్తింది.

సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో వేర్వేరు భాషలకు వేర్వేరు స్క్రీన్‌లు ఉంటాయి. కానీ ఇక్కడ బుక్‌మైషో యాప్‌లో పొరపాటున ఒకే స్క్రీన్‌పై తెలుగు, హిందీ వెర్షన్లకు ధురంధర్ 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షకులు అదే ఆధారంగా భారీగా టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, ప్రదర్శన సమయంలో హిందీ వెర్షన్ షో వేయడంతో తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకేం ఉంది.. మల్టిప్లెక్స్లో ఎక్కువ పైసలు పెట్టి.. సినిమా చూడకపోతే వచ్చే ఫ్రస్టేషన్ ఎలా ఉంటుందో మూవీ లవర్స్కి తెలిసిందే. దాంతో ఇరువురు ప్రేక్షకుల మధ్య వాగ్వదం జరిగింది. “మేము తెలుగు వెర్షన్ టికెట్లు ముందుగానే బుక్ చేసుకున్నాం” అంటూ ఓ మహిళ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు తాము హిందీ వెర్షన్‌కు టికెట్లు కొనుగోలు చేశామని వాదించారు.

ఈ క్రమంలోనే కొందరు ప్రేక్షకులు తమకు కావాల్సిన భాషలో సినిమా ప్రదర్శించకపోతే మెట్లపై కూర్చుని అయినా సినిమా చూస్తామని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమకు నచ్చిన భాషలోనే సినిమా ప్రదర్శించాలని, లేదంటే మరో స్క్రీన్ కేటాయించాలని మరికొందరు డిమాండ్ చేశారు. ఇలా ఒకరికొకరు వాదనకు దిగడంతో థియేటర్‌లో గంటపాటు ఉద్రిక్తత నెలకొంది.

ఇక పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను శాంతింపజేశారు. ఆ వెంటనే, సమస్యను పరిష్కరించేందుకు తెలుగు వెర్షన్‌ను మరో స్క్రీన్‌లో ప్రదర్శించేలా మల్టీప్లెక్స్ యాజమాన్యం ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనతో ప్రేక్షకులకు తాత్కాలిక అసౌకర్యం కలిగింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, ఇది ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్..అదిరిపోయింది పో' అంటూ పలువురు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

ఇదంతా కాదు.. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుని ఉంటే.. అసలు ఇలాంటి సమస్య ఉండేదే కాదని మరికొందరు సరదా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా ‘ధురంధర్ 2’ క్రేజ్‌తో జరిగిన ఈ ఘటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.