ప్రభుత్వం చేతిలో సీఈసీ కీలుబొమ్మలా మారిపోయారు... జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ పై ప్రతిపక్షాల ఫైర్

ప్రభుత్వం చేతిలో సీఈసీ కీలుబొమ్మలా మారిపోయారు... జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ పై ప్రతిపక్షాల ఫైర్
  •     గంపగుత్తగా ఓటర్లను తొలగించారు
  •     ఆయన తొలగింపు కోసం ఇచ్చిన నోటీసుపై కేంద్రం స్పందించాలి

న్యూఢిల్లీ:  సీఈసీ జ్ఞానేశ్ కుమార్  కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఓటర్ల సవరణ పేరుతో  గంపగుత్తగా ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని తాము ప్రవేశపెట్టిన నోటీసులో విమర్శించాయి. సీఈసీ నియామకంపై సందేహాలు ఉన్నాయని పేర్కొన్నాయి. సీఈసీని తొలగించాలని కోరుతూ పార్లమెంటులో తాము సమర్పించిన నోటీసుపై కేంద్రం స్పందించాలని  ప్రతిపక్షాలు డిమాండ్  చేశాయి. 

ఆ నోటీసుపై కేంద్రం స్పందించకపోతే సీఈసీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లేనని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్  ఒబ్రెయిన్  అన్నారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఎలక్టోరల్  రోల్  రివిజన్  ద్వారా ఓటర్లకు పౌరసత్వ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. 

కాగా.. సీఈసీ తొలగింపు కోసం ఈనెల 12న ప్రతిపక్షాలు పార్లమెంట్​లో నోటీసు సమర్పించాయి. ప్రతిపక్ష సభ్యులతో అమర్యాదగా ప్రవర్తించడం, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్  గాంధీని అదేపనిగా టార్గెట్  చేయడం, పారదర్శకత పాటించకపోవడం, రూలింగ్  పార్టీలతో కలిసి సర్  ప్రక్రియను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ఆ నోటీసు సమర్పించాయి. అలాగే, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు సర్  ప్రక్రియ పేరుతో 65 లక్షల ఓట్లను తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.