- చిప్‌ల కొరతే ప్రధాన కారణం
- ఒక్కో ఫోన్‌పై రూ.1,500 వరకు భారం
- 9 శాతం తగ్గిన అమ్మకాలు
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెరిగాయ్. వివో, శామ్సంగ్, ఒప్పో, రియల్మీ, షావోమీ, నథింగ్ వంటి గ్లోబల్ బ్రాండ్లు ఇండియాలో ధరలను 40 శాతం వరకు పెంచాయి. దీనివల్ల వినియోగదారులు కొత్త ఫోన్లు కొనడం కష్టంగా మారింది. ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారం, 2025 చివరి నుంచి ఇప్పటివరకు ఎనిమిదికి పైగా బ్రాండ్లు తమ మోడళ్ల ధరలను పెంచాయి. సగటున ఒక్కో ఫోన్ రేటు రూ.1,500 వరకు పెరిగింది. ముఖ్యంగా బడ్జెట్, మిడ్ రేంజ్ ఫోన్ల ధరలు అధికమయ్యాయి. దీంతో వినియోగదారులు కొత్త ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. చాలా మంది తమ పాత ఫోన్లనే రిపేర్ చేయించుకుని వాడుకుంటున్నారని షాపుల యజమానులు
అంటున్నారు.
ధరల పెరుగుదల ఎందుకంటే..
ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఎన్విడియా ఏఐ డేటా సెంటర్ల కోసం అవసరమైన హెచ్‌బీఎమ్ చిప్‌ల తయారీకి శామ్సంగ్, మైక్రాన్, ఎస్కే హైనిక్స్ వంటి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనివల్ల సాధారణ ఫోన్లలో వాడే డీరామ్, నంద్ చిప్‌ల ఉత్పత్తి తగ్గి వాటి ధరలు 50 నుంచి 60 శాతం పెరిగాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిని రవాణా ఖర్చులు పెరిగాయి. అలాగే రూపాయి విలువ తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది.
మార్కెట్ పై ప్రభావం
ధరల పెరుగుదల ప్రభావంతో ఈ ఏడాది మొదటి రెండున్నర నెలల్లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 9 శాతం మేర తగ్గాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉండే రెండో క్వార్టర్ కంపెనీలకు చాలా కీలకం కానుంది. మార్కెట్ రికవరీకి ఈ ఏడాది చివరివరకు సమయం పట్టొచ్చని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. అయితే యాపిల్ ఐఫోన్ 17తో పాటు శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 26 వంటి ప్రీమియం ఫోన్లపై ఈ ధరల ప్రభావం తక్కువగా ఉంది. బడ్జెట్ ఫోన్లు కొనేవారు మాత్రం పాత ఫోన్ల వాడకాన్ని పెంచడంతో పాటు సెకండ్ హ్యాండ్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫోన్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.
