వరల్డ్ నంబర్-1 మంధాన

వరల్డ్ నంబర్-1 మంధాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డేలో నంబర్-1 ప్లేస్ లో దూసుకెళ్లింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంకు అందుకుంది. ఇప్పటికే.. 2018 సంవత్సరానికిగాను ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఉత్తమ వన్డే ప్లేయర్‌ గానూ.. ఇలా ఒకే క్యాలెండర్ ఇయర్‌ లో రెండు ఐసీసీ అవార్డులు అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌ గా మంధాన నిలిచింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచుల్లో అదరగొట్టిన మంధాన..రాబోయే మ్యాచుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. 2013లో బంగ్లాదేశ్‌ పై వన్డే అరంగేట్రం చేసిన ఆమె, ఆసీస్ పర్యటనలో చేసిన సెంచరీతో ఆకట్టుకుంది. 2017 మహిళల ప్రపంచకప్‌లో మెరుపు ప్రదర్శన చేసి విధ్వంసక ఆటకు కేరాఫ్ వీరెంద్ర సెహ్వాగ్‌ తో పోల్చబడింది. 16 ఏండ్ల ప్రాయంలో భారత్‌ కు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన మంధాన మహిళల క్రికెట్‌ లో సరికొత్త స్టార్‌ గా ఎదిగింది. నిలకడగా ఆడుతూ భవిష్యత్ భారత కెరటంగా దూసుకెళ్తోంది.

మంధాన 2018 ఏడాదిలో అద్భుతంగా రాణించింది. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌ ను టీమిండియా సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. శ్రీలంక, సౌతాఫ్రికా వన్డే, టీ20 సిరీస్‌ లను గెలుచుకోవడంలోనూ మంధాన కృషి చేసింది. 2018లో మంధాన మొత్తం 12 వన్డేలు ఆడింది. ఇందులో 669 రన్స్ చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన అన్ని ఫార్మాట్లలోనూ 66.90 సగటుతో ఏడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేసింది. ఈ ఏడాది టీ20 క్రికెట్‌ లో మంధాన ఐదు హాఫ్ సెంచరీలు చేసి, ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్సఉమెన్‌ గా నిలిచింది. 130.67 స్ట్రైక్ రేట్‌ తో 600లకు పైగా రన్స్ సాధించింది.