స్మృతి మంధనా మాజీ బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్‎పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

స్మృతి మంధనా మాజీ బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్‎పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

ముంబై: టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధనా మాజీ బాయ్ ఫ్రెండ్, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‎పై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద కేసు నమోదు అయ్యింది. స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు, మరాఠీ నటుడు విజ్ఞాన్ ప్రకాశ్ మానే ఫిర్యాదు మేరకు పలాష్ ముచ్చల్‎పై సాంగ్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఓ సినిమా నిర్మాణం కోసం పలాష్ తన దగ్గరి 40 లక్షలు తీసుకున్నాడని.. ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పి మోసం చేశాడని మానే ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి అడిగితే బెదిరిస్తూ కులం పేరుతో దూషించారని, అసభ్య పదజాలంతో అవమానించారని మానే ఆరోపించారు. 

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధనా, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో రద్దైన విషయం తెలిసిందే. 2025, నవంబర్ 23న వీరి వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో పెళ్లి ఆగిపోయింది. ఏమైందో తెలియదు కానీ చివరకు ఈ పెళ్లి రద్దు అయ్యింది.

పలాష్ ముచ్చల్ ఓ లేడీ కొరియోగ్రాఫర్‎తో చేసిన చాట్ లీక్ కావడంతోనే పెళ్లి క్యాన్సిల్ అయిందని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో స్మృతిని మోసం చేశాడంటూ పలాష్‎పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా స్మృతి  ఫ్రెండ్ ఫిర్యాదుతో పలాష్ ముచ్చల్‎పై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.