Smriti Mandhana: మరికొన్ని గంటల్లో పెళ్లి.. తండ్రి అనారోగ్యంతో స్మృతి మంధాన వివాహం వాయిదా

Smriti Mandhana: మరికొన్ని గంటల్లో పెళ్లి.. తండ్రి అనారోగ్యంతో స్మృతి మంధాన వివాహం వాయిదా

టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం తన తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. పలాష్ ముచ్చల్ తో స్మృతి మంధాన వాయిదా పడిందని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా ఆదివారం (నవంబర్ 23) ధృవీకరించారు. ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేసిన మంధాన ఈ రోజు (నవంబర్ 23) వివాహం చేసుకోవాల్సి ఉంది. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆమె పెళ్లి వేడుకలు నేడు గ్రాండ్ గా నిర్వహించారు. వివాహానికి ముందు మెహందీ వేడుకను నిర్వహించారు. ఈ సెలెబ్రేషన్ లో చాలామంది మహిళా క్రికెటర్లు సందడి చేస్తూ కనిపించారు. 

నెల కిందటే ఇండోర్‌‌లో ఈ ఇద్దరి ఎంగేజ్‌‌మెంట్‌‌ జర్గగా.. ఈ విషయాన్ని స్మృతి ఇన్‌‌స్టా పోస్టులో ఇటీవలే వెల్లడించింది. గురువారం (నవంబర్ 20) టీమిండియా ప్లేయర్స్ తో ఒక రీల్ ద్వారా తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ పలాష్ ముచ్చల్‌తో నిశ్చితార్ధం జరిగినట్టు క్లారిటీ ఇచ్చింది. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ ఐన సంగతి తెలిసిందే. అయితే మంధాన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో పెళ్లి వాయిదా వేయక తప్పలేదు. 

మంధాన మేనేజర్ ఈ విషయాన్ని మీడియాకు ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ" ఈరోజు ఉదయం స్మృతి తండ్రి అల్పాహారం తీసుకుంటున్నప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన కోలుకుంటారని భావించి మేము కొంతసేపు ఎదురు చూశాం. కానీ పరిస్థితి మరింత దిగజారడంతో మేము అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాము. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

"స్మృతి తన తండ్రికి చాలా సన్నిహితురాలు. ఆయన కోలుకునే వరకు వివాహం నిరవధికంగా వాయిదా వేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె తండ్రి వైద్యుల పర్యవేక్షనలో ఉన్నారు. ఆయన కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని డాక్టర్ చెప్పారు. స్మృతి తన తండ్రిని అంతా బాగైనప్పుడే వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది". అని మేనేజర్ తుహిన్ మిశ్రా అన్నారు.

స్మృతి కాబోయే వరుడు పలాష్ మాట్లాడుతూ ఇలా అన్నారు. "ఇది మధ్యాహ్నం వివాహం. మేము ఎక్కువ మందిని ఆహ్వానించలేదు. మా సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాము. మా వైపు నుండి దాదాపు 70 మంది అతిథులు.. ఆమె వైపు నుండి 70 మంది అతిథులు హాజరయ్యారు. ఇది రిసెప్షన్ లేని సన్నిహిత వివాహం. రాజకీయ, క్రికెట్ ప్రపంచానికి చెందిన కొంతమంది వ్యక్తులతో మేము ఈ వివాహాన్ని నిర్వహించాం". అని పలాష్ అన్నారు.